జీవనరెడ్డి అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:48 AM
జగిత్యాలలో కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి మా దృష్టికి తీసుకువచ్చారు.. ఆయన అభిప్రాయాలను, ఆవేదనను, ఆలోచన సరళిని సీఎం రేవంతరెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరిస్తాము’ అని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
- తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు
- జీవనరెడ్డితో భేటీ అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ‘జగిత్యాలలో కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి మా దృష్టికి తీసుకువచ్చారు.. ఆయన అభిప్రాయాలను, ఆవేదనను, ఆలోచన సరళిని సీఎం రేవంతరెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరిస్తాము’ అని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవనరెడ్డి నివాసానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీ సీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి వచ్చి సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. జగిత్యాల కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయవద్దని, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదని, పార్టీలో సరైన విధంగా గౌరవం దక్కడం లేదని, అడుగడుగున అవ మానాలు ఎదుర్కొవలసి వస్తోందని, కాంగ్రెస్‌లోకి కొత్తగా చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే సమస్యకు పరిష్కారమని జీవనరెడ్డి సూచించినట్లు కార్యకర్తలు ముచ్చటించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడారు. జీవనరెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదని...ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని, జీవనరెడ్డి మాతో చర్చించిన అంశాలను అధిష్ఠానం ముందు ఉంచుతామన్నారు. జీవన రెడ్డి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారన్న నమ్మకం ఉందన్నారు. సుమారు 4 దశాబ్ధాలకు పైగా జీవనరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారని, ఆయన అనుభవం, సలహాలు, సూచనలు పార్టీకి అవసరమన్నారు. ఈ ప్రాంతానికి జీవనరెడ్డి పెద్దదిక్కన్నారు. జీవనరెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఉండరని, ఆయన భాదపడితే మేము భాదపడినట్లేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా జీవనరెడ్డి పనిచేశారని గుర్తుచేశారు. ఇటీవల అసంతృప్తితో ఉన్న జీవనరెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మీనాక్షి నటరాజన, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, అనేక మం ది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవనరెడ్డితో మాట్లాడి మనోగతం తెలుసు కున్నారన్నారు. జగిత్యాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవనరెడ్డి మా దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. జీవనరెడ్డి పడుతున్న ఇబ్బందులు, మనస్తాపనానికి గురైన కారణాలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారన్నారు. జీవనరెడ్డి చెప్పిన అంశాలను, ఆలోచనలను సీఎం రేవంతరెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మీనాక్షి నటరాజన, అధిష్ఠానానికి వివరిస్తామన్నారు. జీవనరెడ్డి పార్టీ రాజీనామా వ్యవహారంలో కఠిన నిర్ణయాలు తీసుకోరని నమ్ముతున్నామన్నారు. రాజీనామాపై పునరాలోచన చేస్తారని గట్టి విశ్వాసం ఉందన్నారు. జీవన రెడ్డిని అవమానించే ఆలోచన ఎప్పుడు చేయదని, ఆయనంటే సీఎం రేవంత రెడ్డి, మీనాక్షి నటరాజనకు గౌరవం ఉందన్నారు. జీవనరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి, ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వెంట ఉండాలని కోరుకుంటామన్నారు.
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు..
- మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే యోచనలో ఎలాంటి మార్పు లేదని మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి అన్నారు. శనివా రం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు స మావేశమై వెళ్లిన అనంతరం జీవన రెడ్డి అక్కడ ఉన్న కొందరు కార్య కర్తలతో ముచ్చటించారు. రాజకీయ పరిణామాలపై ఈనెల 22వ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడంటూ కార్యకర్తల కేరింతల మధ్య స్పష్టం చేశారు. ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
జీవనరెడ్డి రాజీనామాకు ముహూర్తం ఫిక్స్..
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీన అనుచరులతో కలిసి జీవనరెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని ఓ గార్డెనలో జిల్లాకు చెందిన పలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించినట్లు ప్రచారం ఉంది. మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అనుచరులు, కార్యకర్తల తో మరోమారు చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని జీవనరెడ్డి వర్గాలు అంటున్నాయి. రాజీనామా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే జగిత్యాలలో ఓ పంక్షన హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేవుడు శాసించాడు..మానవుడు అనుసరిస్తాడం టూ..కార్యకర్తలంతా రెడీగా ఉండాలని జీవనరెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో జీవన రెడ్డి పార్టీ రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. జీవన రెడ్డి నిర్ణ యంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది.