స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:16 AM
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 గణతంత్ర దినోత్సవం పురస్కరిం చుకుని ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అంబేడ్కర్ ఆలోచన ప్రకారం అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర ఫలాలను అన్నివర్గాల ప్రజలకకు అందించాలనే ఆలోచనతో భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఆయన తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు సహకరించి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం తిరుపతి, ఏఎంసీ వైస్‌చైర్మన్ సంగ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.