Share News

తెలంగాణ పునర్నిర్మాణానికి కలిసి రావాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:57 AM

’తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల మంచి కోరే వారంతా ఒక్కటి కావాలి.. జగిత్యాల జైత్ర యాత్రతో రాజకీయ పునరేకీకరణ యజ్ఞం ప్రారంభం కావాలి.. ఇందుకు అందరూ కలిసి రావాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి కలిసి రావాలి

- రాజకీయ పునరేకీకరణకు సిద్ధం కండి

- మా ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి వేస్తాం

- జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

(కరీంనగర్‌, ఆంధ్రజ్యోతి, ప్రతినిధి)

’తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల మంచి కోరే వారంతా ఒక్కటి కావాలి.. జగిత్యాల జైత్ర యాత్రతో రాజకీయ పునరేకీకరణ యజ్ఞం ప్రారంభం కావాలి.. ఇందుకు అందరూ కలిసి రావాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తివేస్తామని ప్రకటించారు. జీవన్‌రెడ్డి గుండె ధైర్యం ఉన్న వారు కాబట్టి తెలంగాణ భవిష్యత్‌ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. పదవులు ఆయనకు కొత్త కాదు, ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని ప్రకటించారు. ఆరు నూరైనా నూటికి నూరు శాతం బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జీవన్‌రెడ్డి మంచి పదవిలోకి వస్తారు, ఇక నుంచి జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం నా వంతు అంటూ కేసీఆర్‌ ప్రజలను ఉత్సాహ పరిచారు. ఏడాది తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రసంగించిన కేసీఆర్‌ బావోద్వేగంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై విరుచుకు పడ్డారు. అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రైతుబంధు, దళిత బంధు పథకాలను విస్మరించి రైతులను పేదలను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. మోస పోతే గోసపడుతామని తాను ముందే హెచ్చరించినా కేవలం కొందరు ఆశ పడితే 1.7 శాతం తేడాతో కాంగ్రెస్‌ గెలిచిందని ఆయన అన్నారు.

ఫ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని బయటకు రాలేదు..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశం ఇవ్వాలని తాను బయటకు రాకుండా ఉన్నానని అయితే చిల్లర మాటలు తప్ప మంచి పథకాలు ఏమైనా పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. తన హయాంలో రైతులకు కరెంటు బాధ ఉన్నదా.. ఎరువుల బస్తాల కొరత ఉన్నదా.. ఆలోచించాలన్నారు. ప్రస్తుతం ఎరువుల బస్తాల కోసం యాప్‌ పట్టుకుని తిరిగితే కాళ్ల వాపులు వస్తున్నాయి తప్ప ఎరువుల బస్తాలు రావడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. రాష్ట్ర ఆదాయం ఎందుకు దిగజారి పోయిందో రియల్‌ ఎస్టేట్‌, భూముల ధరలు ఏలా ఉండేవో ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో తాము ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వెంట వెంటనే డబ్బులు అందించామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నామని, ఇప్పుడు మక్కలు కొనే వారు కూడా లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ఫ అధికారంలోకి వచ్చి తీరుతాం..

చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయని కేసీఆర్‌ అన్నారు. పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగలు దాచుకున్న డబ్బులు పొందలేక పోతున్నారంటూ విమర్శించారు. ఎవరితో మాట్లాడినా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే జీవన్‌రెడ్డి లాంటి వారి నోట నుంచి కూడా కాంగ్రెస్‌ పోవాలి, బీఆర్‌ఎస్‌ రావాలి అనే మాట వస్తున్నదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. మిషన్‌ కాకతీయ కింద ఎన్నో చెరువులను అభివృద్ధి చేసినా ఇల్లు కూల గొట్టామా.. గుడిసెలు కూల్చి వేశామా.. అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఏదైనా ప్రశ్నిస్తే కేసీఆర్‌ చావాలని అంటున్నారు. వేయి జన్మలెత్తినా నేను చావను నా కొడుకా.. పిల్లి శాపాలకు ఉట్టి తెగి పడుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ నాడు ఎలా ఉండే.. నేడు ఎలా ఉంది..

తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు. తాను ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టి రాష్ట్రానికి సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలను ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరస్థితులను ప్రజలకు వివరించారు. ప్రజలకు తమ ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన ప్రజా సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అవి నిలిచి పోయిన తీరును ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడేమి రోగం వచ్చిందని పథకాలు నిలిచిపోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతు బంధుకు రాం..రాం చెబుతారు, దళితబంధుకు జైభీం చెబుతారంటూ ముందే చెప్పాను అని గుర్తు చేశారు.

ఫ రెండు నెలలకోసారి ఆరు వేల రూపాయలా..

బీఆర్‌ఎస్‌ హయాంలో వారం రోజుల వ్యవధిలోనే రైతు బంధు సాయం అందించామని, ఇప్పుడు రెండు నెలలకొసారి ఆరు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. జగిత్యాలలో సభ ఉందని తెలిసి రెండో విడుతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులందరికి రైతు బంధు సాయం అందాలంటే తాను మరికొన్ని సభలు పెట్టాలేమో అని ఆయన అన్నారు. జగిత్యాలలో జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో ఉత్సాహం నెలకొంది.

Updated Date - Apr 21 , 2026 | 01:57 AM