సూపర్ ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కోవాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:35 PM
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
సిరిసిల్ల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్న తాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్లలోని చంద్రం పేట రైతు వేదిక నుంచి కలెక్టర్ గరిమ అగ్రవా ల్ హాజరయ్యారు. జిల్లాలోని రైతు వేదికల నుంచి రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గాయని, సాగు నీటి లభ్యత పరిమితంగా ఉండటంతో రైతులు యాసంగి 2026-27 పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్య తలేని ప్రాంతాల్లో సాగుకు దూరంగా ఉండాల ని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సూప ర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వాతా వరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
తాగునీటికి అత్యంత ప్రాధాన్యం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగి స్తూ, రానున్న జూన్ వరకు తాగునీటి అవసరా లను తీర్చేలా అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పని చేయాలని సూచించారు. పశుసంపదను కూడా రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పశువులకు తగినంత తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా పశు సంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయం తో చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభు త్వం గత ఫిబ్రవరి నుంచే రైతులకు అవగాహన కల్పిస్తోందని, ముందస్తు అవగాహన, ప్రత్యా మ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం చేసిన ప్ర యత్నాల ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరా ల్లో వరిసాగు తగ్గిందని, మహబూబ్‌నగర్ ప్రాం తంలో కూరగాయల సాగు పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు వివరించారు. యాసంగిలో అధిక నీటి అవస రం ఉన్న వరి సాగుపై రైతులు జాగ్రత్తగా నిర్ణ యం తీసుకోవాలని సూచించారు. పప్పుధాన్యా లు, నూనెగింజలు, పొద్దుతిరుగుడు, కూరగాయ లు, ఇతర ఉద్యానపంటలు, ఆయిల్‌పామ్ సాగు ను ప్రోత్సహించాలని సూచించారు. యూరియా, విత్తనాల లభ్యతకు ఇబ్బందులురాకుండా చూడా లని ఆదేశించారు. పంటలకు నీటి సరఫరా, వి ద్యుత్ లభ్యతపై అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమాచారం అందిం చాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఎంత నీరు అందుబాటులో ఉంది, ఎంత విద్యుత్ సరఫరా చేయగలమనే వివరాలను స్పష్టంగా తెలియజే యాలని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచేం దుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు గరిష్ట సామ ర్థ్యంతో పనిచేసేలా చూడాలని, సౌర విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, కరువు పరిస్థితులు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందన్నారు. డి సెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రభావం మ రింత బలపడవచ్చన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీరు, పశువుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియో గించాలని, 2027 జూన్ వ రకు తాగునీటి అవసరాల ను తీర్చేలా ముందస్తు ప్ర ణాళికలు రూపొందించాల ని కలెక్టర్లను ఆదేశించారు.
విస్తృతంగా ఉపాధిహామీ పనులు
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గత ఏడా ది రోజుకు సగటున 25 వేల మంది కూలీలు పనులకు హాజరుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.50 లక్షలకు చేరిందని తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 20 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. భారత వాతావరణ శాఖ నిపుణురాలు డాక్టర్ ఎ శ్రావణి మాట్లాడుతూ ప్రస్తుతానికి తెలంగాణలో చెప్పుకోదగిన వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉష్ణోగ్ర తలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు..
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ సూ చనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలు పునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్ట ర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసాయని, భూగర్భజలాలు తగ్గు తున్నాయని వెల్లడించారు. వేడి వాతావరణంతో గృహ ఇతర అవసరాలకు విద్యుత్ వినియోగం సాధారణంకంటే దాదాపు 25 శాతం ఎక్కువ పెరిగిందని తెలిపారు. ప్రాజెక్టులలో ఉన్న నీరు ప్రస్తుతం తాగు నీటికి, పశు సంపద సంరక్షణకు వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీధర్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.