Share News

జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:02 AM

క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ అన్నారు.

జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి
మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) పోటీలు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణనందించి వారు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. డీసీఈబీ కార్యదర్శి భగవంతరావు మాట్లాడుతూ జోనల్‌స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలకు ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేయాలన్నారు. ఢిల్లీ ఢిఫెన్స్‌ అకాడమీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ నాలుగురోజులపాటు క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలను కల్పించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌ బన్సీలాల్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్‌, ఆడెపు శ్రీనివాస్‌, అంతటి శంకరయ్య, గిన్నె లక్ష్మణ్‌, వీరన్న, వి సూర్యప్రకాష్‌, కె కృష్ణ, యూనిస్‌ పాషా, దత్తాత్రేయ, వీర్‌పాల్‌ రెడ్డి, సీహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ పోటీల విజేతలు...

అండర్‌-14 బాలుర ఖో-ఖో విభాగంలో చొప్పదండి ప్రథమ స్థానం, కొత్తపల్లి ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డీ విభాగంలో కరీంనగర్‌ అర్బన్‌ ప్రథమ స్థానం, చొప్పదండి ద్వితీయ స్థానం, వాలీబాల్‌ విభాగంలో కొత్తపల్లి ప్రథమ స్థానం, వీణవంక ద్వితీయ స్థానాలు సాధించాయి.

Updated Date - Sep 20 , 2026 | 01:02 AM