ఏకదంతాయ విద్మహే..
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:39 PM
విఘ్నాలను తొలగించే వినాయకుడు పుట్టిన రోజును వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపద చవితి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని గణేశ చతుర్థి, వినాయక చతుర్థి అని వ్యవహరిస్తారు భారతీయ సంస్కృతి ప్రకారం శుభాశుభకర్మల్లో వినాయకుని పూజించని కార్యక్రమమే ఉండదు. గణపతి శ్లోకాలు, మంత్రాలు లేనిదే ఏకార్యం ప్రారంభం కాదు. ఈ పండుగను సోమవారం జరుపుకోనున్నారు.
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విఘ్నాలను తొలగించే వినాయకుడు పుట్టిన రోజును వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపద చవితి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని గణేశ చతుర్థి, వినాయక చతుర్థి అని వ్యవహరిస్తారు భారతీయ సంస్కృతి ప్రకారం శుభాశుభకర్మల్లో వినాయకుని పూజించని కార్యక్రమమే ఉండదు. గణపతి శ్లోకాలు, మంత్రాలు లేనిదే ఏకార్యం ప్రారంభం కాదు. ఈ పండుగను సోమవారం జరుపుకోనున్నారు.
ఫ పర్వదినాన్ని ఇలా ఆచరించాలి...
ఉదయమే గృహశుద్ధి చేసి మామిడి తోరణాలు, పూలతో అలంకరించాలి. మట్టి ప్రతిమలు తెచ్చుకుని పూజా గృహాల్లో నిలుపుకొని, పంచామృతాలతో అభిషేకించి, 21 రకాల పత్రి, పూలు పండ్లు తెచ్చి పూజ చేయాలి. సంకల్పం చెప్పి షోడషోపచార పూజ జరపాలి. కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం, వెలగపండు, మక్క వెన్నులు వంటి పదార్థాలను సమర్పించి హారతివ్వాలి. వ్రతాన్ని ఆచరించే వారు వినాయకోత్పత్తి, శమంతకమణి ఉపాఖ్యానాన్ని వినాలి.
ఫ పెద్ద ఎత్తున మండపాల నిర్మాణం...
జిల్లా కేంద్రం, గ్రామాలు, మండల కేంద్రాల్లో, ఆలయాల్లో పెద్దఎత్తున మండపాలను నిర్మించారు. భారీ సైజుల్లో అన్ని హంగులతో వివిధ రూపాల్లోవున్న వినాయకులను పలు ప్రాంతాల నుంచి తెప్పించారు. అబ్బురపరిచే సెట్టింగులు, కలకత్తా, రాజస్థానీ డెకరేషన్లతో తీర్చిదిద్ది విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.
ఫ నేడు వినాయకులను నెలకొల్పే సమయమిదే...
ఉదయం 6 గంటల నుంచి తదియ గౌరీ వ్రతాలు ఆచరించాలని, 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మధ్యాహ్న వ్యాపిని చతుర్థి ఉన్నందున వినాయకులను నెలకొల్పవచ్చు. ఒక్కరోజు మాత్రమే పూజ జరిపే వారు సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల లోపు నిమజ్జనం లేదా ఏదైనా మండపంలో విగ్రహాన్ని అప్పగించాలి.
ఫ మార్కెట్‌లో సందడి
మార్కెట్‌లో వినాయక చవితి సామాగ్రి కొనుగోళ్ళ సందడి ఆదివారం ఊపందుకుంది. 21 రకాల పత్రి, ఇతర సామగ్రికి గిరాకీ బాగా పెరిగింది. చిన్న ప్రతిమలు వంద నుంచి 550 రూపాయల వరకు అమ్మారు. పలు విధాల పత్రి ఒకే సెట్ రూపంలో వంద రూపాయల వరకు ధర పలికింది. పూలైతే వెరైటీని బట్టి 50 రూపాయలకు ఒక మూర చొప్పున అమ్మారు. వినాయకునికి వేసే గజమాలలు 500 రూపాయలకు అమ్మారు. ధరలు గతంలో కంటే ప్రస్తుతం పెరిగినట్లు వినియోగదారులు, భక్తులు చెబుతున్నారు.