వాటర్ వార్
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:25 AM
శ్రీరాంసాగర్ నిండితే కాకతీయ, వరద కాలువల ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లకు నీటి తరలింపుతో జలకళ సంతరించుకుంటాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
శ్రీరాంసాగర్ నిండితే కాకతీయ, వరద కాలువల ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లకు నీటి తరలింపుతో జలకళ సంతరించుకుంటాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు సాగునీరు అంది పంటలు విస్తారంగా పండుతాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని శ్రీరాంసాగర్‌తోపాటు మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో వట్టిపోనున్న దశకు చేరుకున్నాయి. సాగునీరేమో కానీ నెలరోజులు గడిస్తే తాగునీరు కూడా ఇవ్వలేని దశకు ఈ ప్రాజెక్టులు చేరుకుంటాయి. వర్షాలు లేని కారణంగా రైతులు వానాకాలం సాగు కోసం వరి నార్లు కూడా పోసుకోలేదు. పత్తి విత్తనాలు వేయలేదు. మరో పక్షం రోజులు గడిస్తే ఆ పంటల సాగు చేసే పరిస్థితే లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే మరోవైపు జిల్లాలో జల రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రాజెక్టుల బాట పట్టి మిడ్‌మానేరులో, లోయర్ మానేరులో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ వంటి ఆటలు ఆడుతూ నిరసన తెలుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నపుడు 365 రోజులు జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు సజీవంగా ఉన్న గోదావరి నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలను పెంచి తాగు, సాగునీరు ఇబ్బంది లేకుండా పోయి రెండు పంటలు గ్యారంటీగా వచ్చాయంటున్నారు. మిషన భగీరథ ద్వారా ప్రజలందరికీ ఇంటి గుమ్మంలో తాగునీరు అందిందని ప్రచారం చేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి మరమ్మతు లు వస్తే వాటిని బాగు చేసి నీటిని ఎత్తిపోయకుండా జాప్యం చేస్తున్నారంటున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి గాయత్రీ పంపుహౌజ్ ద్వారా వరదకాలువకు నీరు వదిలి మిడ్‌మానేరు, లోయర్ మానేరు నింపే అవకాశముందటున్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా దానిని కూడా నింపే అవకాశాన్ని లేకుం డా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఫ కాంగ్రెస్ చర్యతోనే కరువు పరిస్థితులు : బీఆర్‌ఎస్
మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో లోయర్ మానేరు డ్యామ్‌లో, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మిడ్‌మానేరు డ్యామ్‌లో పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆటలు ఆడి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి వాటర్ వార్ ప్రకటించారు. కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే ఈ సంవత్సరం ఎల్‌నినో ఉన్నా కరువు పరిస్థితులు రాకుండా పోయేవని బీఆర్‌ఎస్ నేతులు చెపుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయడానికే మరమ్మతులకు అవకాశమున్నా కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా పనికిరాకుండా చేసి ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని వారు ఆరోపిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై పరిశీలన జరిపి మరమ్మతులు చేపట్టడానికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో, రైతుల్లో చర్చ మొదలైంది. మరమ్మతులు చేపట్టే విషయమై రెండేళ్ల క్రితం ఆదేశాలు ఇచ్చి ఉంటే ఇప్పటికీ పనులు పూర్తయ్యేవి కదా అని కూడా ప్రజల్లో చర్చించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో కూడా ఈ అనుమానాలు రేకెత్తడం కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్‌గా మారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఫ రాజకీయ లబ్ధికోసమే బీఆర్‌ఎస్ ఆరాటం : కాంగ్రెస్
జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల వాటర్‌వార్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు, సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్‌లో ఆటలు ఆడి నిరసన తెలిపిన రోజే కాంగ్రెస్ నేతలతో కలిసి డ్యామ్‌ను సందర్శించి బీఆర్‌ఎస్ ప్రచారాలను తిప్పికొట్టారు. రాజకీయ కారణాలతో లబ్ధిపొందేందుకే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ప్రాజెక్టులు ఎండిపోవడానికి కారణమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదా గుర్తుచేసుకోవాలని ఇకనైనా ప్రజలను తప్పుదోవపట్టించవద్దని ఎదురుదాడి చేశారు. మొత్తానికి వర్షాభావ పరిస్థితులు కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి బీఆర్‌ఎస్ దానిని రాజకీయ అస్త్రంగా సంధిస్తుంటే ప్రజలు ఆదిశగా ఆలోచిస్తుండడం రాజకీయంగా ఆసక్తికలిగిస్తున్నది. జిల్లాలో ప్రారంభమైన ఈ వాటర్ వార్‌ను అన్ని జిల్లాలకు తీసుకవెళ్లాలని బీఆర్‌ఎస్ ఆలోస్తున్నట్లు సమాచారం.