Share News

భూగర్భంలోకి ‘జల’ధారలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:52 AM

వేసవి రాకముందే నీటిగండం భయపెడుతోంది.

భూగర్భంలోకి ‘జల’ధారలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వేసవి రాకముందే నీటిగండం భయపెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్చరించడమే కాకుండా జరిమానాలు వేస్తామని ప్రకటించింది. ఎల్‌నినో విపత్తు, పెరిగిన నీటి వినియోగం, ఉష్ణోగ్రతల ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు రోజుకు పడిపోతున్నాయి. సంవత్సరంతో పోలిస్తే జిల్లాలను బోరుబావులు, వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. జిల్లాలో సగటున 7.82 మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. గత సంవత్సరం అక్టోబరులో సగటున 5.13 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉంటే ఈ సంవత్సరం అక్టోబరులో సగటున 7.82 మీటర్లకు తగ్గిపోయింది. జిల్లాలో అత్యధికంగా వేములవాడ అర్బన్‌ మండలంలో 15.39 మీటర్లకు భూగర్భ తగ్గిపోయాయి. సిరిసిల్లలో 14.08 మీటర్లు, వీర్నపల్లిలో 13.03 మీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 10.91 మీటర్లు, ముస్తాబాద్‌లో 8.50 మీటర్లు, గంభీరావుపేట 8.39 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో తగ్గిపోయి నీటి లభ్యత ప్రమాదకరంగానే కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు లేక జిల్లాలోని చెరువుల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు చేరలేదు. ఎల్‌నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డ మార్పులకు చెరువులు, బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. వానాకాలం సీజన్‌లో సగటు వర్షపాతం ఇప్పటివరకు 808.5 మిల్లీమీటర్లకు 757.5 మిల్లీమీటర్లు కురిసింది. సగటు 6.0 శాతం తక్కువగా ఉండగా, రుద్రంగిలో 32శాతం, చందుర్తిలో 20శాతం, వేములవాడలో 18శాతం, సిరిసిల్లలో 14శాతం, ఎల్లారెడ్డిపేటలో 17 శాతం, ముస్తాబాద్‌లో 13శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ పరిస్థితుల్లో అనుమతులు లేకుండా బోరు బావులు తవ్వకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా బోరుబావుల తవ్వకం ఆగడం లేదు. మరోవైపు వేసవికి ముందే తాగునీటి కటకట కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం

ఎల్‌నినో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు ఎండాకాలం తలపించడంతో చెరువులు, కుంటల్లో కూడా నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. రోజురోజుకు పడిపోతున్న నీటి లభ్యత తగ్గిపోవడంతో చివరి దశలో ఖరీఫ్‌ సాగు ఆవేదన నింపింది. మరోవైపు కరెంటు కోతలతో పంటలకు నీళ్లు అందించలేక రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే వరి కోతలు జోరుగా సాగుతున్న దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరాల్లోనే వరి పంటకు నష్టం వాటిల్లడంతో రైతులకు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ధర గిట్టుబాటుగా ఉన్న దిగుబడి లేక రైతులు దిగాలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, వరి 1.47 లక్ష ఎకరాలు సాగు చేశారు. ఇందులో 90వేల ఎకరాల వరకు సన్న రకం సాగు చేశారు. జిల్లాలో ఒకవైపు వరికోతలు జోరుగా సాగుతుండగా అదేస్థాయిలో కొనుగోలు కూడా జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే సగం వరకు కోతలు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం క్వింటాలకు రూ.2461, బీ గ్రేడ్‌ రూ.2441 ధర నిర్ణయించారు. సన్న రకాలకు రూ.2461 తోపాటు ప్రభుత్వం మరో రూ.500 బోనస్‌ ఇస్తోంది. ప్రస్తుతం జిల్లాలో దొడ్డు రకం వడ్లు క్వింటాలు రూ.2500 వరకు కొనుగోలు చేస్తుండగా.. సన్నవడ్లు రూ.2800 నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యాసంగిలో క్రాప్‌ హాలిడేగా ప్రకటిస్తారని ఊహిస్తున్న క్రమంలో ధాన్యం లభించే అవకాశాలు తక్కువ కానున్నాయని భావించి పచ్చి పచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. మద్యం తయారీతో పాటు అటుకులు, పేలాలు ఉపయోగించడం ద్వారా మరింత కొరత ఏర్పడుతుందని భావించి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా పచ్చిధాన్యం కొనుగోలుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. మరి కొంతమంది మిల్లర్లు లోటు పూడ్చుకునేందుకు కొనుగోళ్లు జరుపుతున్నారు. జిల్లాలో కొనుగోళ్లకు డిమాండ్‌ ఏర్పడడంతో వ్యాపారులు వరి కోతల మిషన్ల యజమానుల నుంచి ముందే సమాచారం తీసుకొని ఏ రైతు వరి కోత చేస్తున్నాడో తెలుసుకొని వాలిపోతున్నారు.

జిల్లాలో జలసిరితో నీటి సంరక్షణ లక్ష్యం

జిల్లాలో చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గిపోయి భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులు అధిగమించే దిశగా నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో తెచ్చిన కరువు గండాన్ని ఎదుర్కొనే దిశగా వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ - గ్రామీణ (వీబీ-జీరామ్‌జీ) కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతంగా పూర్తిచేసే దిశగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మండల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. జిల్లాలో మండల స్థాయిలో ఏర్పాటుచేసే కమిటీలు ఎనిమిది అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌-గ్రామీణ(వీబీ-జీరామ్‌జీ) కూలీలకు వేతన అభివృద్ధి, పశుగ్రాసం, తాగునీరు, తాగునీటి భద్రత, జీవనోపాధి పనులు, నీటి సంరక్షణ, గ్రామీణ సదుపాయాలపై కమిటీ పనిచేస్తుంది. ప్రతివారం సమావేశమై ప్రజలు, కరువు సమస్యలపై చర్చిస్తారు. మంజూరు చేసిన పనులు, జలసిరి తదితర కార్యక్రమాలపై పంచాయతీల వారీగా కమిటీ సమీక్షిస్తుంది. జిల్లాలో ఉన్న చిన్ననీటిపారుదల చెరువులు, కుంటల పరిస్థితిపై సమగ్ర సర్వే చేస్తారు. ఎంత మేరకు పూడిక పేరుకుపోయింది, కట్టలు, తూములు, అలుగులు, ఫీడర్‌ ఛానళ్లకు ఎటువంటి మరమ్మతులు అవసరం అవుతాయో అంచనాలు వేస్తారు. చెరువులు, కాల్వల మరమ్మతులు, వ్యవసాయ కుంటలు, చెక్‌డ్యాములు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ నిర్మాణాలు, వర్షపు నీరును ఒడిసిపట్టే పనులను వీబీ-జీరామ్‌జీ నిబంధన ప్రకారం ఎంపిక చేస్తారు. పశుగ్రాసం సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ బోర్లు ఉన్న రైతులను వ్యక్తిగతంగా ప్రోత్సహించి పచ్చిమేత కొరతను నివారించేందుకు దృష్టి పెడుతారు. పశువులు, గొర్రెలు మేకలకు తాగునీరు అందించేందుకు ఉన్న నీటి తొట్టెలను పరిశీలించి అవసరమయ్యే మరమ్మతు చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన చోట కొత్తవి నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందిస్తారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో పనులను ఉంచే విధంగా చూస్తారు. ఇప్పటికే వీబీ-జీరామ్‌జీ పథకం కింద యాక్టివ్‌ జాబ్‌ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు పని దినాలను కూడా పెంచే విధంగా గ్రామ సభలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో మండలాల వారీగా ఆరు రకాల నిర్మాణాలు చేపట్టారు.

జిల్లాలో మండలాల వారీగా భూగర్భ జలాలు (మీటర్ల లోతులో)..

మండలం 2025 అక్టోబరు 2026 అక్టోబరు

బోయినపల్లి 3.20 4.78

చందుర్తి 3.50 5.31

గంభీరావుపేట 5.09 8.39

ఇల్లంతకుంట 2.45 4.65

కోనరావుపేట 5.17 7.03

ముస్తాబాద్‌ 5.57 8.50

రుద్రంగి 2.78 7.45

సిరిసిల్ల 10.75 14.62

తంగళ్లపల్లి 5.41 7.80

వీర్నపల్లి 7.83 13.03

వేమువలాడ రూరల్‌ 3.84 4.81

వేములవాడ 11.45 15.39

ఎల్లారెడ్డిపేట 7.55 10.91

----------------------------------------------------------------------------------------------------

సరాసరి 5.13 7.82

----------------------------------------------------------------------------------------------------

నవంబరు 5 వరకు జిల్లాలో వర్షపాతం(మిల్లీమీటర్లలో)

మండలం సాధారణం కురిసింది

రుద్రంగి 850.6 581.0

చందుర్తి 880.1 701.1

వేములవాడ రూరల్‌ 870.0 709.9

బోయినపల్లి 765.2 740.3

వేములవాడ 894.8 917.8

సిరిసిల్ల 859.7 735.8

కోనరావుపేట 759.5 841.8

వీర్నపల్లి 809.0 819.0

ఎల్లారెడ్డిపేట 793.2 931.0

గంభీరావుపేట 763.5 709.0

ముస్తాబాద్‌ 713.7 621.0

తంగళ్లపల్లి 866.0 858.3

ఇల్లంతకుంట 685.4 681.8

---------------------------------------------------------------------------------

సగటు వర్షపాతం 808.5 757.5

----------------------------------------------------------------------------------------

Updated Date - Nov 06 , 2026 | 12:52 AM