Share News

చింతకుంట కెనాల్‌కు నీటి విడుదల

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:28 AM

వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా చింతకుంట కెనాల్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

చింతకుంట కెనాల్‌కు నీటి విడుదల

కరీంనగర్‌ టౌన్‌,సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా చింతకుంట కెనాల్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 500 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదలచేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు మరో మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో చింతకుంట కెనాల్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనోత్సవానికి మార్గం సుగమమైంది. సోమవారం వరకూ కెనాల్‌కు నీటిని విడుదల చేయక పోవడంతో బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇటీవలనే కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌, అంతకుముందు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆయా పార్టీల నేతలు, అధికారులతో కలిసి చింతకుంట కెనాల్‌ను సందర్శించారు. వెంటనే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి గణేశ్‌ నిమజ్జనోత్సవం సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. నీటి విడుదల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, నిమజ్జనం వరకు నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్‌ ఖండించింది. మూడు ప్రధాన పార్టీలు చింతకుంట కెనాల్‌కు నీటి విడుదల విషయంలో ఎవరికివారు కెడ్రిట్‌ కొట్టేసి ప్రజల్లో తమవల్లనే నీరు విడుదల చేశారని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫ చురుకుగా వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లు

అధికారులు ఇప్పటికే గణేశ్‌ నిమజ్జనోత్సవ కార్యక్రమాలకు చింతకుంట కెనాల్‌ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన 2,500కుపైగా భారీ విగ్రహాలను మానకొండూర్‌, కొత్తపల్లి చెరువులతోపాటు చింతకుంట కెనాల్‌ వద్ద నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 40 టీఎంసీల నీటి నిలువ మాత్రమే ఉంది. దీంతో కాలువలకు నీటిని విడుదల చేయలేదు. ఈనేపథ్యంలో చింతకుంట కెనాల్‌లో నీరు లేక పూర్తిగా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటన వెలువడక ముందే అక్కడ భారీ క్రెయిన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు మైదానంలో వేదిక, కెనాల్‌లో చెత్తను తొలగించడం, లైటింగ్‌ ఏర్పాట్ల వంటి పనులు చురుగ్గా చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి వచ్చే నీటిని నిలువ చేసి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా నీటిని ఇక్కడ నిలిపేందుకు కట్టలు నిర్మిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు నీరు కెనాల్‌కు చేరుతాయని ఆలోగా పనులను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 3,500 క్యూసెక్కుల నీటిని శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి వదిలితే అనేక చోట్ల నీటిని నిలుపుకోవడం, కాలువల్లో నుంచి రైతులు నీటిని తీసుకునే ప్రయత్నాలుచేస్తారని, తక్కువ నీటిని వదిలితే భారీ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు కష్టం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Sep 22 , 2026 | 12:28 AM