జలం.. అడుగంటుతోంది..
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:53 AM
భూగర్భజలాలపై ఎల్‌నినో పరోక్షంగా పంజా విసురుతోంది.
- పడిపోతున్న భూగర్భనీటి మట్టం
- గతేడాదితో పోలిస్తే 1.38 మీటర్ల లోతుకు
- ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి తీవ్రం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
భూగర్భజలాలపై ఎల్‌నినో పరోక్షంగా పంజా విసురుతోంది. ఎండలు మండుతుండడం.. వానలు ముఖం చాటేస్తుండడంతో భూమి పొరల్లో ఉన్న కాస్త నీళ్లు ఇంతకింతకు కిందకు వెళుతున్నాయి. నెలనెలా పడిపోతున్న నీటిమట్టంతో జనాల్లో భవిష్యత్తుపై బెంగ పెరుగుతోంది. చెరువులు, జలాశయాల్లో ఉన్న కాసిన్ని నీళ్లు ఎండ తీవ్రతకు ఆవిరవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో అనిశ్చితి, దడపుట్టిస్తున్న ఉష్ణోగ్రతలు, విచ్చలవిడిగా బోరుబావుల ద్వారా నీటిని వాడడం వల్ల భూగర్భ జలాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా జలం పాతాళానికి చేరుతోంది. గతేడాది సెప్టెంబరు చివరి నాటి కంటే ఈ ఏడాది 1.38 మీటర్ల లోతుకు నీళ్లు చేరుకున్నాయి. ఈ ఏడాది వేసవి కాలంతో పోలిస్తే మెరుగ్గానే జలాలున్నప్పటికీ ఉన్న ఈ నీళ్లన్ని ప్రస్తుత సీజన్, వచ్చే సీజన్లకు వాడితే వచ్చే వేసవికి గడ్డు కాలమే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో వానలు కురిసి జలాశయాల్లో సమృద్దిగా నీరు పెరిగితే తప్పా.. తాగుసాగు నీటి పరంగా ఇబ్బందులు తప్పేటట్లు లేవు.
ఫ ప్రమాద ఘంటికలు..
- చొప్పదండి మండలంలో అప్పుడే ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బోరుబావుల్లో నీటి మట్టం లోతుకు పడిపోతున్నాయి. అదనంగా మరింత లోతును తవ్వేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోనే అత్యంత గరిష్ఠంగా 12.84 మీటర్ల భూమిలోపల జలాలు ఉన్నాయి. ఎల్‌ఎండీ దిగువన ఉన్న మానకొండూర్ మండలంలో మాత్రం కాకతీయ కాలువలు, చెరువుల్లో నీరున్న కారణంగా ఇక్కడ అతి తక్కువగా 0.98మీటర్ల లోతులోనే నీళ్లుండడం గమనార్హం.!
- గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు నీటి మట్టం 3.48 మీటర్లు ఉండగా ఇప్పుడు 4.86 మీటర్లుగా మారింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 1.38 మీటర్ల అడుగు లోతుకు నీళ్లు చేరాయి. అత్యధికంగా హుజూరాబాద్ మండలంలో 6.38 మీటర్లకు పడిపోయాయి. చొప్పదండిలో -3.69 మీటర్లు, చిగురుమామిడి మండలంలో -3.29 మీటర్లకు చేరుకున్నాయి. మొత్తంగా 15 మండలాలకుగాను 11 మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
ఫ వేసవి నాటికి కటకట..
2025లో జిల్లావ్యాప్తంగా మే నెలలో సగటున 8.44 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. 2025లో అక్టోబరు, నవంబరు నెలల్లోనూ జల్లులు పడ్డాయి. నిర్ణీత వర్షపాతాన్ని మించి అత్యధిక వర్షపాతం అప్పుడు నమోదవడం వల్ల వేసవిలో తాగు, సాగు నీటికి డోకా లేకుండా పోయింది. ఈసారి ఇప్పటి వరకు 747.9 మిల్లీమీటర్ల వర్షానికిగానూ 681.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జిల్లావ్యాప్తంగా ఇంకా 9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పైగా ప్రతి నెలలో సగటున జిల్లాలో నీటి మట్టం ఇక మీదట ఒక మీటరు లోతుకు వెళ్లే అవకాశముంది. ఈ లెక్కన వచ్చే ఎనిమిది నెలల్లో గణనీయంగా నీటి మట్టం పడిపోయే వీలుంది. దీంతో తాగు సాగునీటికి సంక్షోభం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. పైగా చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు చేరలేదు. ఉన్న నీళ్లన్నీ ఈసీజన్ పంటలకు వాడతారు. యాసంగి సీజన్ మరో నెలన్నర రోజుల్లో ప్రారంభమవనుంది. నీటి ఎద్దడి దృష్ట్యా ఆరుతడి పంటల సాగుతోపాటు వరికి ప్రత్యామ్నయ పంటలను అన్నదాతలు ఎంచుకోవాలనే ప్రయత్నాలు వ్యవసాయశాఖ అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఊరూరా నీటి ఎద్దడి దృష్ట్యా పంటమార్పులను చేపట్టాలని కోరుతున్నారు.
సెప్టెంబరు నెలలో (మీటర్లు)
--------------------------------------------
మండలం 2025 2026 వ్యత్యాసం
--------------------------------------------
చొప్పదండి 9.15 12.84 -3.69
గంగాధర 9.08 11.26 -2.18
హుజూరాబాద్ 1.12 7.48 -6.36
రామడుగు 5.84 6.42 -0.58
కొత్తపల్లి 5.05 5.47 -0.42
చిగురుమామిడి 1.37 4.66 -3.29
సైదాపూర్ 2.60 4.25 -1.65
వీణవంక 2.15 4.14 -1.99
కరీంనగర్ 6.04 3.97 +2.07
శంకరపట్నం 2.37 3.62 -1.25
తిమ్మాపూర్ 1.87 3.40 -1.53
జమ్మికుంట 2.40 3.24 -0.84
ఇల్లందకుంట 1.49 2.86 -1.37
కరీంనగర్‌రూరల్ 2.79 2.13 +0.66
గన్నేరువరం 2.85 2.08 +0.77
మానకొండూర్ 0.77 0.98 -0.21