Share News

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:10 AM

ఉద్యోగ విమరణ చేశాము.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం.. అనుకుంటున్న రిటైర్డ్‌ ఉద్యోగులను ప్రభుత్వ వైఖరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉద్యోగ విమరణ చేశాము.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం.. అనుకుంటున్న రిటైర్డ్‌ ఉద్యోగులను ప్రభుత్వ వైఖరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇన్నాళ్లు చేసిన ఉద్యోగం నుంచి తప్పుకున్నామనే ఆందోళన ఒకవైపు.. వయసు కారణంగా వచ్చే అనారోగ్యాలు మరోవైపు వారిని కుంగదీస్తున్నాయి. నెలనెలా వచ్చే పెన్షన్‌ కనీస అవసరాలకు సరిపోయినా.. పదవీ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలతో బాకీలు, పిల్లల పెళ్లిళ్లు చేద్దామకున్నవారికి నిరాశే ఎదురవుతోంది.. ఏ బాదరబందీ లేకుండా ఇంట్లో కూర్చొని మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడపాల్సిన వారు రిటైరుమెంట్‌ బెనిఫిట్స్‌ కోసం రోడ్డున పడి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- ఒక్కొక్కరికి రూ. 50 లక్షల నుంచి 60 లక్షల బకాయిలు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు 2,472 మంది పదవీ విరమణ చేశారు. వారికి సగటున ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 60 లక్షలు అందాల్సి ఉంది. ప్రభుత్వం వాటి చెల్లింపు గురించి ఊసే ఎత్తని కారణంగా సుమారు 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బు కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తూ అవి అందక ముందే 26 మంది పెన్షనర్లు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021 మార్చిలో రిటైర్‌ కావలసిన వారి వయోపరిమితిని 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో 2021 మార్చిలో రిటైర్మెంట్‌ కావలసిన వారు 2024 మార్చి వరకు ఉద్యోగాల్లో కొనసాగి అప్పటి నుంచి రిటైర్మ్డెంట్‌ అవుతూ వస్తున్నారు. గడిచిన 25 నెలల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 2472 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్‌ అయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడమే కాకుండా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే అందేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేయడంతోపాటు గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన డీఏలను మంజూరు చేస్తామని చెప్పింది. వైద్యసేవలు పొందేందుకు హెల్త్‌కార్డులు జారీ చేస్తామని, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బకాయిలతోపాటు పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి.

ప్రతినెలా రిటైర్‌ అవుతున్న ఉద్యోగులు, అయిన ఉద్యోగులు పెన్షనరీ బకాయిలు రాక, కుటుంబ అవసరాలు తీరక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాము 35, 40 సంవత్సరాల ఉద్యోగ కాలంలో పొదుపుచేసి ప్రభుత్వంపై నమ్మకంతో వారి వద్ద దాచుకున్న జీపీఎఫ్‌, టీఎస్‌ జీఎల్‌ఐ, జీఐఎస్‌ డబ్బులు మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ సర్వీసులో 300 సెలవులు వాడుకోకుండా దాచుకునే అవకాశమున్నది. వాటికి ప్రభుత్వం వేతనం ప్రకారం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్‌ అయిన ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా లీవ్‌లకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్‌ బేసిక్‌ పే నుంచి 40 శాతం అప్పుగా పొందే కమ్యూటేషన్‌ సౌకర్యం విషయాన్ని అసలే పట్టించుకోవడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.. 25 నెలలుగా బకాయిలు అందక పోవడంతో పెన్షనర్లు తమతమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలను, మంత్రులు, ప్రతిపక్ష నాయకులనుకలిసి గోడును వెల్లబోసుకున్నారు. ధర్నాలు, నిరాహారదీక్షలు లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్త ంచేస్తున్నారు.

- పెన్షనర్ల డబ్బులు వెంటనే చెల్లించాలి..

- కోహెడ చంద్రమౌళి, రెవా రాష్ట్ర కో కన్వీనర్‌

ఉమ్మడి జిల్లాలో పెన్షనర్లకు 1400 కోట్ల రూపాయల పెన్షనరీ బెనిఫిట్స్‌ అందాల్సి ఉన్నది. ఉద్యోగుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. పెన్షన్‌ బెనిఫిట్స్‌ అందుకోకుండానే ఉమ్మడి జిల్లా పరిధిలో రెండేళ్ళుగా ఉద్యోగ విరమణ చేసిన 2,472 మందిలో 26 మంది చనిపోయారు. ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశంలో రిటైర్‌ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిల విషయాన్ని ప్రకటించక పోవడం ఆందోళన కలిగిస్తున్నది. తక్షణమే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

Updated Date - Apr 03 , 2026 | 01:10 AM