Share News

ఓట్లు తగ్గుతున్నాయి.. సర్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:10 AM

జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 10న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్న నేపథ్యంలో డిజిటలైజేషన ప్రక్రియను వేగవంతం చేశారు.

ఓట్లు తగ్గుతున్నాయి.. సర్‌

కరీంనగర్‌ టౌన, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 10న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్న నేపథ్యంలో డిజిటలైజేషన ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలోని కరీంనగర్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో డిజిటలైజేషన ప్రక్రియ చివరకు చేరుకుంది. మ్యాపింగ్‌ చేసిన ఓటర్లకు ఎన్యూమరేషన ఫారాలను వంద శాతం పంపిణీ చేశారు. అందులో కొన్ని అన కలెక్టబుల్‌ పేరుతో పత్రాలు సేకరించడానికి వీలు లేకుండా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సర్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిస్థాయిలో పూర్తిచేయాలని మానిటరింగ్‌ చేస్తున్నారు. దీంతో మొదట్లో కొంత ఆలస్యంగా సాగినా గడువు దగ్గరపడటంతో డిజిటలైజేషనను వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఫ కరీంనగర్‌లో..

కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్‌ కార్పొరేషన, కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో కలిపి మొత్తం 3,68,832 ఓటర్లు ఉండగా 2,62,942 ఓటర్ల డిజిటలైజేషన ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 3.353 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన చేయాల్సి ఉంది. 1,02,537 మంది ఓటర్లను అన కలెక్టబుల్‌ (ఏఎస్‌డీ) కేటగిరీలో తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏఎస్‌డీ కేటగిరీలో 9,391 మంది మృతిచెందినట్లుగా, ప్రస్తుతం అందుబాటులో లేని ఓటర్లు 4,560, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిప్ట్‌ అయిన ఓటర్లు 74,964, ఒకటి కంటే ఎక్కువగా పేర్లు నమోదైన ఓటర్లు 7,990, ఇతరులు 3,353 మంది ఉన్నట్లు ప్రకటించారు.

ఫ స్వగ్రామాల్లోనే ఓట్లు..

కరీంనగర్‌ జిల్లా కేంద్రం కావడంతో విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలా మంది మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడితోపాటు వారివారి స్వగ్రామాలు, పట్టణాల్లో కూడా ఓటర్లుగా నమోదయ్యారు. సర్‌లో ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవలసి ఉండడంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కరీంనగర్‌ కార్పొరేషన పరిఽధిలో కాకుండా వారి స్వగ్రామాల్లోనే ఓటరుగా నమోదు చేయించుకుంటున్నారు. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అనకలెక్టబుల్‌ కేటగిరీలో 1,02,537 మంది ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించి వారి పేర్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 71.29 శాతం ఓటర్ల వివరాలు డిజిటలైజేషన పూర్తయ్యింది. 3,353 మంది ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజేషన చేయాల్సి ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు 72శాతం ఓటర్లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయి. దాదాపు 28శాతం ఓటర్లు నియోజకవర్గంలో తగ్గనున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓటరుగా నమోదు చేయించుకున్న వారిలో ఎక్కువ మంది వారి స్వగ్రామాల్లోనే ఓటరుగా నమోదు చేయించుకోవడంతో చాలా డివిజన్లలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది.

ఫ నియోజకవర్గాలవారిగా..

చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో కలిపి మొత్తం ఓటర్లు 2,39,716 మంది ఉన్నారు. 2,10,394 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన చేశారు. 82.98 శాతం ప్రక్రియ పూర్తికాగా 426 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన చేయాల్సి ఉంది. చొప్పదండి నియోజకవర్గంలో ఏసీడీ కేటగిరిలో 28,396 ఓటర్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- మానకొండూర్‌ నియోజకవర్గంలో మానకొండూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 2,26,250 ఓటర్లు ఉండగా 2,06,406 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన చేశారు. 91.23 శాతం డిజిటలైజేషన పూర్తికాగా 169 ఓటర్ల వివరాలను చేయాల్సి ఉంది. 19,675 మంది ఏసీడీ కేటగిరిలో ఓటర్లను తొలగించనున్నారు.

- హుజూరాబాద్‌ నియోజకవర్గంలో హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో 2,54,292 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,25,488 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన 88.67శాతం పూర్తయింది. ఇంకా 254 మంది వివరాలను డిజిటలైజ్‌ చేయాల్సి ఉంది. 28,550 మంది ఏసీడీ కేటగిరిలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.

ఫ జిల్లాలో ఏసీడీ కేటగిరీలో 1,79,158 మంది ఓటర్లు

జిల్లాలో 10,89,090 మంది ఓటర్లు ఉండగా 1,79,158 మంది ఓటర్లను ఏసీడీ కేటగిరిలో తొలగించనున్నారు. దీంతో జిల్లా ఓటర్ల సంఖ్య 9,09,932 ఉన్నట్లుగా ఇప్పటి వరకు డిజిటలైజేషన ద్వారా వెల్లడైంది. జిల్లాలో మొత్తం 83.16శాతం ఓటర్ల వివరాలను డిజిటలైజేషన చేశారు. తుది జాబితా ఈనెల 10వ తేదీన విడుదల చేసే వరకు ఓటర్ల సంఖ్యలో కొద్దిపాటి తేడా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అర్హులైన వారి పేర్లను తొలగించకుండా పారదర్శకతతో ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 01:10 AM