ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకూడదు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:13 AM
అర్హత ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్‌వో, బీఎల్‌ఏలు ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సైదాపూర్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్‌వో, బీఎల్‌ఏలు ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మంత్రి సైదాపూర్ మండంలోని ఎలబోతారంలో ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజంట్లతో మాట్లడి ఫారాల పంపిణీ, నమోదు పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. 2002, 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2002లోనూ ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టారన్నారు. ప్రస్తుతం ఏంద్ర ప్రభుత్వం ఓటర్ల సవరణ పేరుతో తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతీ పౌరుడు బీఎల్‌వో, బీఎల్‌ఏలకు సరైన సమాచారం ఇచ్చి ఏవైనా సవరణలు ఉంటే సరి చేసుకోవాలన్నారు. అనంతరం గొడిశాల గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఫ సర్వాయి పాపన్న గుట్ట వద్ద పనుల పరిశీలన
మండలంలోని సర్వాయిపేటలోని సర్వాయి పాపన్న గుట్ట వద్ద చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనులు ఎంత వరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితాగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, సర్పంచులు నమిండ్ల రవిందర్, పోలు స్వరూపప్రవీణ్, సింగిల్‌విండో అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, గుండారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ చిగురుమామిడిలో..
చిగురుమామిడి: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మ వారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భవాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో మహిళ సమాఖ్య భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.