ఓట్ చోరీని అడ్డుకోవాలి..
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:26 PM
ఓట్ల చోరీని అరికట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు.
కరీంనగర్ అర్బన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓట్ల చోరీని అరికట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మోదీ సర్కార్ వచ్చాక సీబీఐ, ఈడీ, ఐటీ లాగే ఎలక్షన్ కమిషన్‌ను కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చారని విమర్శించారు. బెంగాల్‌లో మమతా బెనర్జీని, బీహార్‌లో ఇండియా కూటమిని ఓడించడానికి లక్షలాది ఓట్లు తొలగించారన్నారు. ప్రస్తుత ఛీప్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలువలకు తిలోదకాలిచ్చి మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో పని చేస్తున్నాడన్నారు. ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 సార్లు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జెన్ జీ ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించినట్లు, దేశంలోని ప్రతీ పౌరుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించి, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇద్దరు కమిటీ సభ్యులు సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని 14 సార్లు అభ్యంతరం చెప్పినా జ్ఞానేష్ కుమార్ వినలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిందన్నారు. ఆయనను తొలగించే వరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పురుమల్ల శ్రీనివవాస్, ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌బాబు, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, నాయకులు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, కర్ర సత్యప్రసన్నరెడ్డి, చర్ల పద్మ, ఉప్పుల అంజనీప్రసాద్, ఎర్ర శ్రీనివాస్, సిరాజ్ హుస్సేన్, కొరివి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.