నిబంధనల ఉల్లంఘన
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:30 AM
జిల్లాలో కొందరు ప్రభుత్వ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ వైద్య వృత్తిని పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
జగిత్యాల, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు ప్రభుత్వ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ వైద్య వృత్తిని పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి వేళలో కూడా తమ సొంత ప్రైవేటు క్లినిక్స్‌లో కాలం వెల్లదీస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాల్లో గల తెలంగాణ వైద్య విదాన పరిషత్ ఆసుపత్రులు, పలు పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలా మంది ప్రైవేటు ప్రాక్టీస్ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఘనంగా ఉన్నాయని సంబంధిత ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆసుపత్రి పనివేళల్లో పలువురు వైద్యులు అందుబాటులో లేక రోగులు నిరీక్షించాల్సి వస్తోంది. కొందరు వైద్యులు విధులను ఇతర వైద్యులకు అప్పగించి ప్రైవేటు ప్రాక్టీస్‌లో ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంలో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది.
ఫనిబంధనలు ఇలా...
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందించాలి. మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటల నుంచి మెడికల్ కళాశాలలో టీచింగ్ విధులను పలువురు వైద్యులు నిర్వర్తించాల్సి ఉంది. ఆర్‌ఎంవోలు మూడు షిప్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. వైద్య విధాన పరిషత్తు పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ విభాగంలో సేవలు అందించే వైద్యులకు రోస్టర్ పద్ధతిలో విధులను కేటాయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు విధి నిర్వహణ సమయాల్లో ప్రైవేటుక్లినిక్‌లలో విధులు నిర్వహించరాదు. కానీ ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే కొందరు వైద్యులు ఉదయం ఆసుపత్రికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు.
ఫధనార్జనే ధ్యేయంగా...
పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జగిత్యాలలో జిల్లా ఆసుపత్రితో పాటు అనుసంధానంగా మాతా శిశు ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ చిన్న జబ్బు చేసినా ఇక్కడికే వస్తారు. కానీ కొందరు ప్రభుత్వ వైద్యులు ధనార్జనే ధ్యేయంగా ఒప్పందం చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో వైద్యులు అందుబాటులో ఉండక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు తీసుకునే వైద్యులు ప్రైవేటు క్లినిక్‌లలో పని చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వైద్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఫసొంతంగా ప్రైవేటు క్లినిక్‌లు..
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు విభాగాల వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాతాశిశు ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ద్వారా పలువురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మెజారిటీ వైద్యులు సొంతంగా ప్రైవేటు క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సుమారు పాతిక మంది వైద్యులు స్థానికంగానే ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను వారివారి క్లినిక్‌లకు రావాలని వైద్యులు సూచించడం గమనార్హం. చాలా మంది రోగులు విధిలేక ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైద్యులపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు కోవాలని ఇటు ప్రజలు, అటు రోగులు కోరుతున్నారు.