Share News

విజయీభవ..

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:11 AM

జిల్లాలో ఇంటర్మీడియేట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. బుధవారం నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

విజయీభవ..

జగిత్యాల అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియేట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. బుధవారం నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్‌లో ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోని ప్రతి సెంటర్‌ పరీక్ష నిర్వహణ తీరును హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు.

ఫజిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు

జిల్లాలో ఇంటర్మీడియేట్‌ పరీక్షల నిర్వహణ కోసం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 16కాగా, 12 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, 2 మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 6,644 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1055 మంది కలిపి మొత్తం 7,699 మంది హాజరుకానున్నారు. ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ విద్యార్థులు 6,531మంది, 895 ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి మొత్తం 7,426 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫవిధుల్లో 30మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు

జిల్లాలో ఉన్న మొత్తం 30పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 30మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 30మంది అదనపు పర్యవేక్షకులు, 12మంది అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు, నలుగురు సిట్టింగ్‌ స్వ్కాడ్‌లతో పాటు, 420మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. ప్రతి సెంటర్‌లో పారామెడికల్‌ సిబ్బందిని నియమించారు. ప్రతి సెంటర్‌లో డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, లైటింగ్‌, ఫ్యాన్‌లు, తాగునీరు లాంటి సౌకర్యాలను కల్పించారు.

ఫపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ఇంటర్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వీటిని ఓ స్ర్టాంగ్‌ రూంలో భద్రపరిచారు. ఓఎంఆర్‌ షీట్లు, బుక్‌లెట్లు, జిల్లా పోలీస్‌ స్టేషన్లకు చేరుకోగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ ఎస్కార్ట్‌ ద్వారా ఆయా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం ఇద్దరు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల్లో 163 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

ఫనిబంధనలు..

-పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి.

-పరీక్ష కేంద్రం లోపలికి ఎలక్ర్టానిక్‌ వస్తువులు, కాలిక్యులేటర్లు, మొబైల్‌ ఫోన్లు అనుమతించరు.

-పుస్తకాలు గాని, ప్రింటెడ్‌ మెటీరియల్‌ను పరీక్ష కేంద్రం వద్దకు తెచ్చుకోవద్దు.

-అత్యవసర పరిస్థితుల్లో ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిస్తారు.

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి

-బొప్పరాతి నారాయణ, డీఐఈవో

ఇంటర్మీడియేట్‌ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాయాలి. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాం. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. సయమాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్షలు రాయాలి.

పకడ్బందీ ఏర్పాట్లు

సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ఇంటర్మీడియేట్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

Updated Date - Feb 25 , 2026 | 01:11 AM