Share News

ధాన్యం నిల్వలపై విజి‘లెన్స్‌’

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:23 AM

జిల్లాలో రైస్‌ మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం అక్రమాలు, నిల్వల తేడాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ. కోట్ల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యం పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. రికార్డులను, ధాన్యం నిల్వలను సరిపోల్చుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైస్‌ మిల్లుల్లో సోదాలు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం పలువురు మిల్లర్లు సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సీఎంఆర్‌ రికవరీలో భారీ అవకతవకలు, ధాన్యం నిల్వల లోటు ఉన్నట్లుగా అధికారుల సోదాల్లో తేలింది.

ధాన్యం నిల్వలపై విజి‘లెన్స్‌’
మిల్లులో తనిఖీలు చేస్తున్న అధికారులు

- రూ. 87 కోట్లకు పైగా ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు

జగిత్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైస్‌ మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం అక్రమాలు, నిల్వల తేడాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ. కోట్ల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యం పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. రికార్డులను, ధాన్యం నిల్వలను సరిపోల్చుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైస్‌ మిల్లుల్లో సోదాలు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం పలువురు మిల్లర్లు సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సీఎంఆర్‌ రికవరీలో భారీ అవకతవకలు, ధాన్యం నిల్వల లోటు ఉన్నట్లుగా అధికారుల సోదాల్లో తేలింది. సుమారు రూ. 87 కోట్లకు పైగా ధాన్యం పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో రూ. 40 కోట్ల విలువ గల టెండర్‌ ధాన్యం, రూ. 47 కోట్లు వివిధ సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్‌ ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. రైస్‌ మిల్లు యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. క్రిమినల్‌ కేసు నమోదుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

వేలం వేసిన ధాన్యం మాయం

జిల్లాలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్‌ కోసం కేటాయించింది. మిల్లర్లు మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఏ సీజన్‌లో ధాన్యం కేటాయిస్తే గరిష్టంగా మూడు నెలల్లోనే బియ్యం మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో 2022-23 యాసంగిలో కేటాయించిన సుమారు రూ. 220 కోట్ల విలువ గల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని జిల్లాలోని సుమారు 90 మంది మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించలేదు. అయినప్పటికీ అప్పటి సమయంలో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మిల్లులోని ఆ ధాన్యాన్ని 2024 సంవత్సరంలో వేలం వేసింది. వేలం దక్కించుకున్న వారికి మిల్లర్లు ధాన్యం అప్పగించాల్సి ఉంది. అయితే ఇందులో గత వారం రోజుల వరకు సుమారు రూ.18 కోట్లు ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించిన మిల్లర్లు మిగితా ధాన్యం అప్పగించడం లేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. మిగిలిన ధాన్యం చాలా మిల్లుల్లో లేదని అధికారులకు సమాచారం ఉంది. ఎలాంటి వివాదం లేకుండా రాష్ట్రంలో టెండర్‌ ధాన్యం రికవరీ కొరకు ప్రభుత్వం రెండు నెలల క్రితం కేబినెట్‌ సబ్‌ కమిటీ నియమించింది. ఆ సబ్‌ కమిటీ ఇటు మిల్లర్లు, అటు పౌరసరఫరాల సంస్థ, ధాన్యం కొనుగోలు చేసేందుకు వేలంలో పాల్గొన్న సంస్థలతో చర్చించింది. మూడు నెలల్లో ధాన్యానికి సంబంధించి అంతే విలువైన డబ్బు చెల్లించాలని మిల్లర్లను ఆదేశించింది. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం పాతిక శాతం కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో గల రెండు, మూడు రోజులుగా మూడు మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేయగా టెండర్‌ ధాన్యానికి సంబంధించి సుమారు రూ. 38 కోట్ల విలువ గల ధాన్యం నిల్వలు లేనట్లు గుర్తించారు. ధాన్యం నిల్వలు లేకపోవడం, డబ్బులు చెల్లించడానికి మిల్లర్లు ఆసక్తి కనబరచకపోవడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఒత్తిడితో ఇప్పుడు మిల్లర్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారని, ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన గడువు ఆగస్టు 5వ తేదీతో ముగుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

మిగితా మిల్లుల సంగతేంది?

జిల్లాలో టెండర్‌ ధాన్యానికి సంబంధించి బకాయిలున్న రెండు, మూడు రైస్‌ మిల్లుల్లో మాత్రమే విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించడం, బకాయిలున్న సుమారు 80కి పైగా మిల్లులను పట్టించుకోకపోవడంతో సంబంధిత వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోరుట్ల ప్రాంతానికి చెందిన ఓ రైస్‌ మిల్లర్‌ సుమారు రూ. 20 కోట్లు బకాయిలున్నాడని, ఓ మాజీ ప్రజాప్రతినిధి మిల్లుకు సంబంధించి రూ. 30 కోట్లు బకాయిలున్నాయని, రూ. 5 కోట్ల నుంచి రూ. 10 లక్షల వరకు సుమారు 50కి పైగా రైస్‌ మిల్లర్లు టెండర్‌ ధాన్యం బకాయిలున్నాయని, వీరి నుంచి రికవరీపై ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి

గత యేడాది చివరి నాటికి 2024-25 వానాకాలం సీజన్‌కు సంబంధించి 56 రైస్‌ మిల్లుల నుంచి రూ.114 కోట్ల విలువల 49,020.130 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సీఎంఆర్‌ బియ్యం అప్పగించాల్సి ఉన్నట్లు సివిల్‌ సప్లయి వర్గాలు పేర్కొంటున్నాయి. 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించి 96 రైస్‌ మిల్లుల నుంచి రూ. 662.74 కోట్ల విలువ గల 2,80,674.459 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సీఎంఆర్‌ బియ్యం బకాయిలున్నట్లు తెలుస్తోంది. సంబంధిత మిల్లులో ప్రస్తుతం ధాన్యం నిల్వలు అంతగా లేవని, అధికారులు పకడ్బందీగా ఫిజికల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. దీనికి తోడు 2025-26 యాసంగి సీజన్‌లో పలువురు మిల్లర్లకు సివిల్‌ సప్లయి శాఖ అధికారులు సుమారు రూ. 1,300 కోట్లకుపైగా విలువ గల 5.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. నిబంధనల ప్రకారం సంబంధిత ధాన్యం మూడు నెలల్లో గానుగాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉంది.అయితే ప్రతివారం పర్యవేక్షించాల్సిన సివిల్‌ సప్లయి శాఖ డిప్యూటీ తహసీల్ధార్లు, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో విచారణ నిర్వహించాల్సిన అవసర ముందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారుల పాత్రపై అనుమానాలు

కోట్ల రూపాయల టెండర్‌ ధాన్యం బకాయి ఉన్న రైస్‌ మిల్లులకు అధికారులు ధాన్యం కేటాయింపులు జరపడం, కేటాయించిన ధాన్యాన్ని రికవరీ చేసుకోకపోవడంతో అక్రమార్కులకు అధికారులు సహకరించడమేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ. లక్షల్లో సీఎంఆర్‌ బకాయిలు ఉండి డిఫాల్టరు జాబితాలోకెక్కిన రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపడం లేదు రూ. కోట్లలో టెండర్‌ ధాన్యం బకాయిలున్న రైస్‌ మిల్లర్లకు తిరిగి యాసంగి, వానాకాలం సీజన్‌లలో ధాన్యం ఎలా కేటాయిస్తున్నారన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. అక్రమార్కులకు అధికారులు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పాత్రపై సైతం విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

Updated Date - Aug 01 , 2026 | 12:25 AM