విజయోస్తు..!
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:13 AM
పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శనివారం నుంచి పరీక్షలు నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. విద్యారంగంలో ఉన్నత చదువులకు విద్యార్థికి తొలిమెట్టుగా పదో తరగతి నిలుస్తుంది. పదో తరగతిలో విద్యార్థులందరూ మెరుగైన ఫలితాలు పొందే విధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వార్షిక పరీక్షల కోసం ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను చదివించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరిగే వార్షిక పరీక్షలు నిర్వహణలో ఈసారి విద్యాశాఖ మార్పులు తెచ్చింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఏడు సబ్జెక్టులు 30 రోజులపాటు పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. ప్రతి పరీక్షకు మధ్య నాలుగు రోజుల విరామం ఉంటుంది. విద్యార్థులు ఎన్నో ఆశలతో విజయం సాధించాలనే తపనతో పరీక్షలకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో భద్రపరిచిన పరీక్ష పత్రాలను ఆయా మండలాల పోలీస్ స్టేషన్లకు పంపించారు.
జిల్లాలో 7,317 మంది విద్యార్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 3,511 మంది, బాలికలు 3,806 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 138మంది ఉండగా బాలురు 86మంది, బాలికలు 52 మంది ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,091 మంది విద్యార్థులు ఉండగా బాలురు 1,691మంది, బాలికలు1,400 మంది, మోడల్ స్కూల్‌లో 535మంది ఉండగా బాలురు 288 మంది, బాలికలు 247 మంది, కేజీబీవీలో563 మంది బాలికలు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 1,926 మంది విద్యార్థులు ఉండగా, బాలురు 1,120, బాలికలు 806 మంది ఉన్నారు. మైనార్టీ వేల్ఫేర్ పాఠశాలలో 70 మంది ఉండగా, బాలురు 30, బాలికలు 40 మంది ఉన్నారు. తెలంగాణ వేల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 504 మంది ఉండగా, బాలురు 140, బాలికలు 364 మంది ఉన్నారు. ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్‌లో బాలికలు 63 మంది ఉన్నారు. ఎంజేటీబీసీ వేల్ఫేర్‌లో 287 మంది ఉండగా, బాలురు 156, బాలికలు 131 మంది ఉన్నారు.
34 కేంద్రాలు.. సీసీ కెమెరాల నిఘా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరీక్షల నిర్వహాణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లుగానే సీసీ కెమెరాలను ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థుల కోసం, ఒక పరీక్ష కేంద్రం ఒకసారి ఫెయిలైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు 637 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో 350 మంది ఇన్విజిలేటర్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్‌లు, 34 డిపార్ట్‌మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్స్ సెంటర్‌కు ఒకరి చొప్పున 34 మందిని నియమించారు. మరో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 5మంది రూట్ అఫీసర్లతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను అత్యవసర వైద్య సేవలకు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.
ఐదు నిముషాల వరకు ఒకే..
పది విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా సమయానికి వెళ్లడం మంచిది. విద్యార్థులు 8.30 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 9.35 నిముషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచి పంపిస్తారు.
టైం టేబుల్ ఇలా...
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 14న తెలుగు పరీక్ష, 18న హిందీ, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్ 7న జీవశాస్త్రం, ఏప్రిల్ 13న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. గతంలో 10వ తరగతి పరీక్షలు వెంటవెంటనే నిర్వహిస్తూ, 11 పేపర్లు ఉన్న సమయంలో 15 రోజులపాటు నిర్వహించేవారు. గతంలో ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన ప్రతిరోజు పరీక్షలు వరుసగా ఉండేవి. ఈసారి సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షకు పరీక్షకు మధ్య నాలుగు రోజుల వ్యవధిలో నిర్వహించే విధానం తీసుకొచ్చారు. సబ్జెక్టుకు మధ్య నాలుగు రోజుల విరామం ఉండడంతో ఆ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాసే పరీక్షపై మరోసారి సందేహాలు నివృత్తి చేస్తారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు...
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో 9391398780 హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలకు సంబంధించిన సందేహాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
విద్యార్థులకు జాగ్రత్తలు...
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సి జాగ్రత్తలివి..
ఫ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల యూనిఫాం వేసుకోకూడదు.
ఫ ఓఎంఆర్ షీట్ తమదని ధృవీకరించుకున్న తర్వాత పరీక్షలు రాయాలి.
ఫ హాల్‌టికెట్ నంబర్ వేయవద్దు.
ఫ సెల్ ఫోన్‌లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతించరు.
ఫ పరీక్ష కేంద్రానికి ఎలాంటి కాగితాలు, జిరాక్స్ పేపర్లు తీసుకవెళ్లవద్దు.
ఫ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పరీక్ష సమయంలో లోపలికి అనుమతి ఉండదు.
ఫ కేవలం పరీక్షకు ఐదు నిముషాల ఆలస్యం మాత్రమే సడలింపు ఉంటుంది. 9.30కి పరీక్ష ప్రారంభం కానుంది. ఆ ప్రకారం 9.35 నిముషాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.
ఫ పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత 15 నిముషాలు బార్ కోడ్ షీట్, అన్సర్ షీట్, ఏలా నింపాలో ఇన్విజిలేటర్ ద్వారా తెలుసుకోవాలి.
ఫ ఎలాంటి గుర్తింపు వివరాలను ఆన్సర్ షీట్‌లపై రాయవద్దు.
ఫ ఏమైనా ఫిర్యాదులు ఉంటే డీఈవోకు తెలియజేయాలి.
ఫ విద్యార్థులు ప్యాడు, హాల్‌టికెట్, పెన్నులు మర్చిపోవద్దు.