భక్త జనసంద్రంగా వేములవాడ
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:31 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది.
వేములవాడ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లో భక్తులు కిక్కిరిసిపోయి కనిపించారు. ఓం నమఃశివాయ స్మరణతో భక్తులు క్యూలైన్‌లో గంటల తరబడి బారులు తీరారు. శీఘ్రదర్శనం, బ్రేక్‌దర్శనం క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు భీమేశ్వర స్వామి ప్రత్యేక పూజలో పాల్గొని తరించారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండాదీపంలో నూనె పోస్తూ గండాలు తొలగిపోవాలని, దీపాలు వెలిగించి పసుపుకుంకుమలతో వర్ధిల్లాలని భక్తులు అమ్మవారిని దీపారాధన చేస్తూ వేడుకున్నారు. గాయత్రిమాత ఆలయంలో కుంకుమపూజలో పాల్గొన్నారు. అనంతరం శివకల్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం 50 వేల మందికి పైగా భక్తులు రావడంతో కోడెమొక్కుల టికెట్లు 3420, శీఘ్రదర్శనం టికెట్లు 2461, అతిశీఘ్రదర్శనం టికెట్లు 853, మహారుద్రాభిషేకం 116, అన్నపూజ 68, శికల్యాణం 63, కుంకుమ పూజ 12, సత్యనారాయణ స్వామి వ్రతం 8, చండీహోమం 4 టికెట్లు భక్తులు తీసకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు..
వేములవాడ భీమేశ్వర స్వామివారి ఆలయానికి 50 వేలకు పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో నేరుగా మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. క్యూలైన్‌లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. క్యూలైన్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులు తీసుకున్న టికెట్‌లను పరిశీలించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
భీమన్న సేవలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి, నీరజ..
వేములవాడ భీమేశ్వర స్వామివారిని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి. నీరజ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం భీమన్న ఆలయానికి వీచ్చేసిన ఆమె స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడెమొక్కు చెల్లించుకున్నారు. పూజలు అనంతరం మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.