వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:18 AM
వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి.. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సుంకరి సంపత్ డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి.. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సుంకరి సంపత్ డిమాండ్ చేశారు. జూలై 1నుంచి వీబీజీ రాంజీ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ సీఐటీయూ, ఏఐకేఏఎస్, ఏఐఏడబ్ల్యూ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, వీబీ జీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. 125 రోజుల పని దినాలు అని ప్రచారం చేస్తున్నారు కాని నిధులు కెటాయింపు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నదన్నారు. గతంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదని, ప్రస్తుతం 60 శాతం మాత్రమే ఇస్తామని, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెపుతోందన్నారు. వ్యవసాయ పనుల సీజన్‌లో 60 రోజులు పని బంద్ చేయాలని కొత్త చట్టంలో ఉందని, కనీస వేతనాల గురించి కొంత్త చట్టంలో పేర్కొనలేదన్నారు. కొత్త చట్టం అమలయితే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. కూలీల పని హక్కును హరించే కొత్త చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు రాయికంటి శ్రీనివాస్, కోశాధికారి మాతంగి శంకర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి రాజేశం, సహాయకార్యదర్శి పున్నం, గౌరీమియా రజిత, వీరమ్మ, జ్యోతి, పుల్లెల మల్లయ్య, బుర్ర రత్నాకర్, మల్లేశ్, వెంకటేష్ పాల్గొన్నారు.