Share News

యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:30 AM

యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కన్నాపూర్‌లో తమ వద్ద ఉన్న చిన్న ఫోనలో యూరియా యాప్‌ లేదని, తమ పంటలకు అవసరమైన యూరియా బస్తాలు ఎలా పొందాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు.

యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలి
కన్నాపూర్‌లో రోడ్డుపై నిరసన చేపడుతున్న రైతులు

- కన్నాపూర్‌లో రైతుల ఆందోళన

శంకరపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కన్నాపూర్‌లో తమ వద్ద ఉన్న చిన్న ఫోనలో యూరియా యాప్‌ లేదని, తమ పంటలకు అవసరమైన యూరియా బస్తాలు ఎలా పొందాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు. బుధవారం శంకరపట్నం మండలం మెట్‌పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపూర్‌ గోదాంకు 230 యూరియా బస్తాల లోడ్‌ వచ్చింది. సమాచారం తెలుసుకున్న కన్నాపూర్‌, ధర్మారం గ్రామాలతోపాటు సమీప గ్రామాల రైతులు గోదాం వద్దకు చేరుకున్నారు. ఫర్టిలైజర్‌ యూరియా యాప్‌లో లింకు ఇవ్వగానే రైతులు తమ మొబైల్‌ ద్వారా బుకింగ్‌ యాప్‌లో బుక్‌ చేస్తుండగా, అక్కడున్న కొంత మంది రైతులకే యూరియా బస్తాలు బుక్‌ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే 230 బస్తాలు బుక్‌ అయ్యాయి. అక్కడున్న కొంత మంది రైతులు ఓటీపీ ఎంటర్‌ చేసి స్టాక్‌ చూసేసరికి సైట్‌లో బస్తాలు అయిపోయాయి. చిన్న ఫోన్లు ఉన్న రైతులతో పాటు యూరియా బస్తాలు బుకింగ్‌ కాని రైతులు గోదాం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కన్నాపూర్‌, రాజాపూర్‌ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తాము అందుబాటులో ఉన్న తమ వద్ద బుకింగ్‌ చేసుకోవడానికి ఫోన్లు లేవని, తమకు బస్తాలు ఎవరిస్తారని మండిపడ్డారు. తమ పంట పొలాలను కాపాడుకునేది ఎలా అని ప్రశ్నించారు.

Updated Date - Feb 12 , 2026 | 12:30 AM