Share News

రైతువేదికల్లోనూ యూరియా విక్రయాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:05 AM

జిల్లాలో గల రైతువేదికల్లోనూ యూరియా విక్ర యాలు జరిపేందుకు వ్యవసాయ శాఖాధికారులు సన్నా హాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు.

రైతువేదికల్లోనూ యూరియా విక్రయాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో గల రైతువేదికల్లోనూ యూరియా విక్ర యాలు జరిపేందుకు వ్యవసాయ శాఖాధికారులు సన్నా హాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. అలాగే ప్రైవేట్‌గా ఎరువుల దుకాణాల్లోనూ విక్రయిస్తు న్నారు. ఈ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులు ఒకేసారి పంటకు సరిపడా యూరియాను కొనుగోలు చేయకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం యాప్‌ను తీసుకవచ్చింది. ఆ యాప్‌ ద్వారా గడిచిన యాసంగి సీజన్‌లో రైతులు కావాల్సిన యూరియా కోసం బుకింగ్‌ చేసుకుని యూరియా తీసుకున్నారు. ఆరంభంలో కొంత మేరకు రైతులకు ఇబ్బందులు కలిగినా కూడా, సాంకేతిక పరంగా తలెత్తిన పొరపాట్లను సరిదిద్దడంతో ఆ తర్వాత సాఫీ గానే యూరియా రైతులకు అందింది. యాప్‌ విధానాన్ని కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సరిపడా యూరి యా మార్కెట్‌లో లేని కారణంగానే అందరు రైతులకు యూరియా అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం యాప్‌ను తీసుక వచ్చింది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా దేశంలో యూరియా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్‌ ఆధారితంగా యూరియాను ఉత్పత్తి చేస్తారు. సరిపడా గ్యాస్‌ సరఫరా లేని కార ణంగా యూరియా ఉత్పత్తి పూర్తి స్థాయిలో కావడం లేదు. జిల్లాలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ ద్వారా పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి జరగడం లేదు. రాష్ర్టానికి ప్రతీ నెలా ఇవ్వాల్సిన యూరియా కోటాను తగ్గించింది. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు పండించే పంటలకు రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా అందే అవకాశాలు కనబడడం లేదు. యూరియా పక్కదారి పట్టకుండా, అందరికీ అందిం చాలనే ఉద్ధేశ్యంతో రైతువేదికల ద్వారా కూడా యూరి యా విక్రయాలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. సోమవారం దీనిపై వ్యవసాయ శాఖ కమిషనర్‌ అన్ని జిల్లాల వ్యవసాయ శాఖాధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించి అనువుగా ఉన్న రైతు వేదికలను ఎరువుల విక్రయాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు రైతు వేదికలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 54 రైతు వేదికలు ఉన్నాయి.

ఫ జిల్లాలో 2,78,290 ఎకరాల్లో సాగు అంచనా..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 2,78,290 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ప్రతి సీజన్‌లో వరి, పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. 2,15,500 ఎకరాల్లో వరి, 52,094 ఎకరాల్లో పత్తి, 886 ఎకరాల్లో మొక్కజొన్న, 208 ఎకరాల్లో కంది, 10 ఎకరాల్లో పెసర, 11 ఎకరాల్లో మినుములు, 12 ఎకరాల్లో ఇతర పంటలు, 2 ఎకరాల్లో వేరుశెనగ, 44 ఎకరాల్లో నువ్వులు, 3179 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌, 133 ఎకరాల్లో మిర్చి, 295 ఎకరాల్లో పసుపు, 376 ఎకరాల్లో ఇతర పప్పు దినుసులు, 5,128 ఎకరాల్లో కూరగాయలు, 415 ఎకరాల్లో ఇతర పంటలను రైతులు పండించనున్నారని అధికారులు అంచనా వేశారు. ఈ పంటలకు గాను 31,138 మెట్రిక్‌ టన్నుల యూరియా, 3,767 టన్నుల డీఏపీ ఎరువులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. జిల్లాలో ప్రస్తుతానికి 16 వేల టన్నుల యూరియా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే గాకుండా వాటి ద్వారానే రైతు వేదికల్లో కూడా యూరి యా విక్రయించాలని నిర్ణయించారు. అయితే అందుకు చాలా రైతు వేదికలు అందుబాటులో లేవు. వర్షాలు వస్తే తడవనే గ్యారంటీ లేని పరిస్థితి. రైతు వేదికల వద్దకు రైతులు వెళ్లి యూరియాను కొనుగోలు చేసే సరిస్థితి లేదు. సహకార సంఘాలతో పాటు ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల వద్దనే కొనుగోలు చేస్తున్నారు. రైతు వేదికల్లో యూరియా విక్రయాలు చేపట్టాలనే నిర్ణయం సరైంది కాదని రైతులు అంటున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:05 AM