Share News

‘మొక్క’వోని దీక్ష..

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:06 AM

మేఘం సమృద్ధిగా వర్షించగానే ప్రకృతి పులకరించే విధంగా.. పచ్చదనానికి కాంతులు తెచ్చే వన మహోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

‘మొక్క’వోని దీక్ష..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మేఘం సమృద్ధిగా వర్షించగానే ప్రకృతి పులకరించే విధంగా.. పచ్చదనానికి కాంతులు తెచ్చే వన మహోత్సవానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మొక్కవోని దీక్షతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. 2026-27 వన మహోత్సవంలో భాగంగా 12వ విడత మొక్కలు నాటేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీలో మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలు కురవగానే మొక్కలను నాటే ప్రక్రియ చేపట్టన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాల్లో మొక్కలను నాటే విధంగా వివిధ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. వనమహోత్సవంలో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూల మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వన మహోత్సవంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జూన్‌ 2న లాంఛనంగా మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి సంవత్సరం 8,65,200 లక్షల మొక్కలు నాటాలనే ప్రభుత్వం దిశానిర్ధేశానికి అనుగుణంగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది.

ప్రణాళిక సిద్ధం..

గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఆధ్వర్యంలో అన్ని శాఖలను భాగస్వాములను చేస్తూ వర్షాలు కురవడంతోనే మొక్కలు నాటడానికి ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 14 శాఖల ద్వారా 8.65 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 11వ విడత హారితహారంలో మొక్కలు నాటడానికి 10.38 లక్షల మొక్కలు నాటే విధంగా లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేశారు. 12వ విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 8,65,200 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 260 గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో 9 లక్షల మొక్కలను పెంచారు. నర్సరీలలో ఉన్న మొక్కలను ఆయా గ్రామాల్లో నాటనున్నారు. ఇళ్లలో నాటేందుకు పూలు, పండ్ల మొక్కలను అందించనున్నారు.

శాఖల వారీగా లక్ష్యాలు...

వనమహాత్సవ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లాలో ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఈ సారి 8.65 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 5.70 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో లక్ష, వేములవాడ మున్సిపాలిటీలో 50 వేలు, వ్యవసాయ శాఖలో 25 వేలు, అటవీ శాఖ 75000, ఎక్సైజ్‌ శాఖ 20 వేలు, విద్యాశాఖ 2 వేలు, ఉద్యానవన శాఖ 5 వేలు, ఆర్‌అండ్‌బీ శాఖ 4 వేలు, నీటి పారుదల శాఖ 7 వేలు, వైద్య ఆరోగ్య శాఖ 2 వేలు, పోలీస్‌ శాఖ 4 వేలు, మైనింగ్‌ శాఖ 200, విద్యాశాఖ 2వేలు, పరిశ్రమల శాఖ వెయ్యి చొప్పున మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉపాధిహామీలోనే మొక్కల లక్ష్యం ఎక్కువే..

వనమహాత్సవంలో మొక్కలు నాటడం సంరక్షణలో ఉపాధిహామీ కిందనే ఎక్కువగా లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారు. 2026-27 సంవత్సరానికి 5.70 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు డీఆర్‌డీఏ ద్వారా 2020-21లో 28,53,745 మొక్కలు నాటగా, 27,29,701 మొక్కలు, 2021-2022లో 26,78,762 మొక్కలు, 2022-23 సంవత్సరంలో 19,17,248 మొక్కలు, 2023 - 24 సంవత్సరంలో ఉపాధిహామీ కింద 6,92,099 మొక్కలు నాటారు. 2024-2025 సంవత్సరంలో 6.06 లక్షల మొక్కలు నాటారు. 2024-26 సంవత్సరానికి 6.77 లక్షల లక్ష్యంగా మొక్కలు నాటారు.

జిల్లాలో ఉపాధిహామీలో నాటే మొక్కలు లక్ష్యం

మండలం గ్రామ పంచాయతీలు మొక్కలు

బోయినపల్లి 23 50 వేలు

చందుర్తి 19 60 వేలు

ఇల్లంతకుంట 35 60 వేలు

గంభీరావుపేట 22 60 వేలు

కోనరావుపేట 28 60 వేలు

ముస్తాబాద్‌ 22 60 వేలు

రుద్రంగి 10 10 వేలు

తంగళ్లపల్లి 30 60 వేలు

వీర్నపల్లి 17 50 వేలు

వేములవాడ రూరల్‌ 11 30 వేలు

వేములవాడ అర్భన్‌ 17 10 వేలు

ఎల్లారెడ్డిపేట 26 60 వేలు

----------------------------------------------------------------------------------------------

మొత్తం 260 5,70,000

----------------------------------------------------------------------------------------------

జిల్లాలో నర్సరీల్లో మొక్కలు

మండలం గ్రామాలు మొక్కలు

బోయినపల్లి 23 55,000

చందుర్తి 19 88,900

ఇల్లంతకుంట 35 69,650

గంభీరావుపేట 22 77,900

కోనరావుపేట 28 73,600

ముస్తాబాద్‌ 22 89,000

రుద్రంగి 10 56,500

తంగళ్లపల్లి 30 1,01,500

వీర్నపల్లి 17 96,000

వేములవాడ అర్భన్‌ 11 26,000

వేములవాడ రూరల్‌ 17 53,300

ఎల్లారెడ్డిపేట 26 1,12,650

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 260 9,00,000

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 12 , 2026 | 01:06 AM