Share News

తడవని మడి.. అన్నదాతలో అలజడి

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:13 AM

వానాకాలం పంట సీజన్‌ మొదలై నలభై రోజులు దాటినా వరుణుడు కరుణించకపోవడంతో జిల్లా రైతుల్లో అలజడి మొదలైంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ప్రధానపంటల విత్తనాలు నేలను తాకలేదు. భూగర్భజలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతులు అగచాట్లు పడుతున్నాడు.

తడవని మడి.. అన్నదాతలో అలజడి

- ఎల్‌నినోతో ఎండుతున్న దుక్కులు

- నాట్ల సమయం వచ్చినా పత్తాలేని వానలు

- బోరు మెటార్లకు కరెంటు కష్టాలు

- వరి సాగుపై నీలినీడలు

వానాకాలం పంట సీజన్‌ మొదలై నలభై రోజులు దాటినా వరుణుడు కరుణించకపోవడంతో జిల్లా రైతుల్లో అలజడి మొదలైంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ప్రధానపంటల విత్తనాలు నేలను తాకలేదు. భూగర్భజలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతులు అగచాట్లు పడుతున్నాడు. వరుణుడి కోసం ఆకాశం వైపు, ప్రభుత్వ సాయం కోసం అధికారుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. - జగిత్యాల

రైతులను వర్షాతిభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. సీజన్‌ ప్రారంభమై నలభై రోజులైనా.. జిల్లాలో ఇప్పటి వరకూ కేవలం పాతికశాతం పంటలు సాగు కాలేదు. జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల కింద 1,51,746 ఎకరాలు, వరద కాలువ కింద 11,201ఎకరాలు, చెరువులు, కుంటలు, బోరుబావుల కింద 1,04,483 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాభావ పరిస్థితులతో ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు నాట్లు వేయడం లేదు. బోరుబావుల కింద, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. కాగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధం చేసుకున్న నారు ప్రస్తుతం నాటు దశకు చేరుకుంది. కానీ నీరు పారక పొలాలు దున్నడం కాలేదు. బోరు నీటితో సాగు చేద్దామంటే కరెంట్‌కష్టాలు వెంటాడుతున్నాయి. త్రీఫేజ్‌ తెల్లవారుజామున, సాయంత్రం గంట సేపు వస్తుండడంతో నారుమడుల వరకే నీరు సరిపోతోంది.

అంతంతమాత్రంగానే సాగు..

జిల్లాలో ఈ యేడాది 4,25,950 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉంది. జిల్లాలో ప్రధానంగా 3,16,000ఎకరాల్లో వరి, మొక్కజొన్న35,000, పత్తి19,000, ఇతరపంటలను సాగు చేస్తారని అంచనా ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 1.70లక్షల ఎకరాలల్లో వరి సాగుకు వరినారు పెంచుతున్నారు. మొక్కజొన్న 30,063ఎకరాలు, పత్తి 10,500ఎకరాలు, పసుపు 8,526ఎకరాల్లో, కందులు 480 ఎకరాల్లో సాగువుతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు..

జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో భూగర్బ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో జూన్‌, జూలై నెలల్లో అడపాదడపా వర్షాలు కురిసినా భూ తాపానికి నీరు నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో జిల్లాలోని బోరుబావులు, ఇతర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్లాయి. అత్యధికంగా జిల్లాలోని కొడిమ్యాలలో 13.78మీటర్ల లోతుకు, కోరుట్లలో 11.4 మీటర్లు, అత్యల్పంగా బీర్‌పూర్‌ మండలంలో 3.22మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరాయి.

జిల్లాలో లోటు వర్షం...

ప్రస్తుత యేడాది జూన్‌ 1నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సగటున 221.7మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 163.6మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 10మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 20మండలాలకు గానూ 15మండలాల్లో లోటు వర్షపాతం, 4 మండలాల్లో సాధారణం, ఒక మండలంలో అధికంగా వర్షం కురిసింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 46 మిల్లీమీటర్ల లోటు, మల్లాపూర్‌లో 36, రాయికల్‌లో 29, బీర్‌పూర్‌లో 10, సారంగపూర్‌లో 35 , జగిత్యాల రూరల్‌లో 32, జగిత్యాలలో 15, కోరుట్లలో 36, మెట్‌పల్లిలో 4, కథలాపూర్‌లో 11, కొడిమ్యాలలో 23, పెగడపల్లిలో 10, గొల్లపల్లిలో 27, బీమారంలో 42మిల్లీమీటర్ల లోటు వర్షం కురిసింది.

ఫ వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం..

- కూసరి మల్లారెడ్డి, రైతు, వెల్ధుర్తి గ్రామం, జగిత్యాల

ప్రస్తుత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సాగుపనులు ముందుకు కదలడం లేదు. నెల రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. వర్షాలు కురవక పోతే మా పరిస్థితి అగమ్య గోచరమే. ప్రత్యామ్నయ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలి.

ఫ సకాలంలో వర్షాలు కురిస్తేనే మేలు..

- తొపారపు ప్రసాద్‌, రైతు, తిమ్మాపూర్‌ గ్రామం, జగిత్యాల

సకాలంలో వర్షాలు కురిస్తేనే పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతీయేటా పంటలను పండించే భూములను వృథాగా వదిలివేయాల్సి వస్తోంది. వర్షాలు కురవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం.

Updated Date - Jul 11 , 2026 | 01:13 AM