Share News

వణికిస్తున్న అకాల వర్షాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:06 AM

అష్టకష్టాలు పడి యాసంగిలో సాగు చేసుకున్న పంటలపై అకాల వర్షం, రాళ్ల వానల భయం అన్నదాతలను వెంటాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమున్న ఎండల్లో ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రైతులను భయభ్రాంతులకు గురిచేసింది.

వణికిస్తున్న అకాల వర్షాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అష్టకష్టాలు పడి యాసంగిలో సాగు చేసుకున్న పంటలపై అకాల వర్షం, రాళ్ల వానల భయం అన్నదాతలను వెంటాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమున్న ఎండల్లో ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. భారీ గాలితో కురిసిన వర్షానికి యాసంగి వరి, మొక్కజొన్న నేల వాలింది. మామిడికాయలు రాలిపోయాయి. ప్రతి ఏట యాసంగి సీజన్‌లో ప్రకృతి ప్రకోపించడం, బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో పడే వడగళ్ల వాన రైతులను నష్టాన్ని మిగిలిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. గాలివాన బీభత్సానికి ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని పలుచోట్ల మొక్కజొన్న, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఇల్లంతకుంట మండలం కేసన్నపల్లె, ముస్కాన్‌పేట, ఆరేపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లింది. కళ్లాల వద్ద ఆరబోసిన పొద్దు తిరుగుడు గింజలు తడిసిపోయాయి. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, కుర్తిలింగంపల్లి గ్రామాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు మండలాల్లో వరి గింజలు నేలరాలాయి. జిల్లాలో మంగళవారం సరాసరి 2.8 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. ఇందులో రుద్రంగిలో 10.5 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 7.0 మీటర్లు, వీర్నపల్లిలో 6.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 6.0 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 5.3 మిల్లీమిటర్లు, సిరిసిల్లలో 3.8 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 3.7 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 2.6 మీటర్లు, కొనరావుపేటలో 1.7 మిల్లీమీటర్లు, చందుర్తిలో, వేములవాడల్లో 1.6 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న కూరగాయలు, మామిడి తోటలకు నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 1.89 లక్షల ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలో రైతులు యాసంగిలో 1.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.81 లక్షల ఎకరాల్లో వరి వేసుకున్నారు. మొక్కజొన్న 4,308 ఎకరాలు, నువ్వులు 288 ఎకరాలు, పొద్దు తిరుగుడు 1,400 ఎకరాలు, కందులు 356 ఎకరాలు, వేరుశనగ 23 ఎకరాలు, పెసర 7 ఎకరాలలో సాగు చేశారు. ఇతర పంటలు 763 ఎకరాల్లో వేసుకున్నారు. పంటల సాగులో గంభీరావుపేట మండలంలో 18,705 ఎకరాలు, ఇల్లంతకుంటలో 26,436 ఎకరాలు, ముస్తాబాద్‌లో 21,107ఎకరాలు, సిరిసిల్లలో 4,523ఎకరాలు, తంగళ్ళపల్లిలో 20,005 ఎకరాలు, వీర్నపల్లిలో 7,400 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 18,505 ఎకరాలు, బోయినపల్లిలో 13,889 ఎకరాలు, చందుర్తిలో 16,687 ఎకరాలు, కోనరావుపేటలో 19,350 ఎకరాలు, రుద్రంగిలో 6,120 ఎకరాలు, వేములవాడలో 5,318 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 11,070 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి సాగులో గంభీరావుపేట మండలంలో 18,700 ఎకరాలు, ఇల్లంతకుంటలో 23,500ఎకరాలు, ముస్తాబాద్‌లో 21,100 ఎకరాలు, సిరిసిల్లలో 4,500 ఎకరాలు, తంగళ్ళపల్లిలో 20,000 ఎకరాలు, వీర్నపల్లిలో 7,400 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 18,500 ఎకరాలు, బోయినపల్లిలో 12,600 ఎకరాలు, చందుర్తిలో 15,500 ఎకరాలు, కోనరావుపేటలో 19,200 ఎకరాలు, రుద్రంగిలో 4,770ఎకరాలు, వేములవాడలో 5,200 ఎకరాలు, వేములవాడరూరల్‌లో 10,950 ఎకరాల్లో సాగు చేశారు. వరి పంట సాగునీరు అందక ఎదుగుదల లేక రైతులు ఇబ్బంది పడుతుండగా మరోవైపు వివిధ రకాల తెగుళ్లు నష్టాన్ని చూపుతోంది. ధాన్యం దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఈసారి మొక్కజొన్న పంటపై ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగులో ఇల్లంతకుంటలో 1,500 ఎకరాలు, ముస్తాబాద్‌లో 5 ఎకరాలు, తంగళ్ళపల్లిలో 5 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 5 ఎకరాలు, బోయినపల్లిలో 1,060 ఎకరాలు, చందుర్తిలో 1,100 ఎకరాలు, కోనరావుపేటలో 80 ఎకరాలు, రుద్రంగిలో 400ఎకరాలు, వేములవాడలో 38 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 115 ఎకరాల్లో సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:06 AM