Share News

మొక్కజొన్నకు దక్కని మద్దతు ధర

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:35 AM

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. దీంతో రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. పంట చేతికి వచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాలను

మొక్కజొన్నకు దక్కని మద్దతు ధర

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. దీంతో రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. పంట చేతికి వచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అయిన కాడికి విక్రయించుకుంటున్నారు. 2025-26సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాలుకు 2,400రూపాయల మద్దతు ధర ప్రకటించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది క్వింటాలుకు ప్రభుత్వం 175రూపాయలు పెంచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. పంట అంతా దళారుల పాలవుతున్నది. తమ అవసరాల కోసం పలువురు రైతులు దళారులకు పంటను విక్రయిస్తున్నారు. దళారులు క్వింటాలుకు మక్కలకు 1700నుంచి 1750రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో రైతులకు క్వింటాలుకు 650నుంచి 700 రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నది.

ఫ జిల్లాలో పెరిగిన మొక్కజొన్న సాగు..

గడిచిన ఐదేళ్ల నుంచి పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రతి ఏటా 9వేల నుంచి 12వేల ఎకరాలకు మించకుండా రైతులు మొక్కజొన్న పండించారు. కానీ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో మాత్రం జిల్లా వ్యవసాయ శాఖాధికారులు 18,940ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారని అంచనా వేశారు. కానీ అంతకుమించి 24,582ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.

మండలం ఎకరాల్లో సాగు

కాల్వశ్రీరాంపూర్‌ 6,956

ఓదెల 5,719

సుల్తానాబాద్‌ 1,594

ఎలిగేడు 605

జూలపల్లి 4,773

పెద్దపల్లి 3,199

ధర్మారం 917

ముత్తారం 217

మంథని 377

కమాన్‌పూర్‌ 9

రామగిరి 8

విత్తనోత్పత్తి కోసం..

జిల్లాలో సాగైన మొక్కజొన్నలో విత్తనోత్పత్తి కోసం 8వేల ఎకరాలకు పైగా ఆడ, మగ మొక్కజొన్న పంటవేశారు. ఆడవిత్తనాలను మాత్రం ఆయా విత్తనకంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. ఎకరానికి ఆడ విత్తనాలు 10నుంచి 11క్వింటాళ్ల వరకు, మగ విత్తనాలు 2నుంచి 3క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. మగ విత్తనాలను మాత్రం రైతులు బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఆడ విత్తనాలకు ఆయా కంపెనీలకు బట్టి ధర ఉంటుంది. సాధారణంగా వేసే మొక్కజొన్న పంట ఈ సీజన్‌లో 30నుంచి 32క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. కానీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 25క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఫ ఎకరానికి రూ.18వేల నుంచి 20వేల వరకు నష్టం..

ఒక్కో రైతు ఎకరానికి 18వేల నుంచి 20వేల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రైవేట్‌వ్యాపారులకు అడ్డగోలు ధరలకు విక్రయించుకోవాల్సి వచ్చింది. గతఏడాది జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. చాలామంది రైతులు పంట కోసి కంకులను రోడ్లపై ఆరబోశారు. కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలకు పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

Updated Date - Apr 16 , 2026 | 12:35 AM