Share News

బోర్డు తిప్పేసిన ‘యూనిక్‌’

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:08 AM

బడుగు జీవుల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. గుజరాత రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ కేంద్రంగా నడిచే యూనిక్‌ స్వయం మల్టీస్టేట్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (యూనిక్‌ ఎస్‌ఎస్‌సీఎస్‌) సంస్థ కరీంనగర్‌లో తన బ్రాంచిని ఏర్పాటు చేసింది.

బోర్డు తిప్పేసిన ‘యూనిక్‌’

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రోజుకు 500 రూపాయల నుంచి 5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్‌ చేస్తే 6 సంవత్సరాలలో రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మబలికిన గుజరాత్‌కు చెందిన యూనిక్‌ మర్కైంటల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు డిపాజిట్‌ రూపంలో సేకరించింది. అనంతరం కార్యాలయాన్ని మూసివేసి బోర్డు తిప్పేసింది.. డిపాజిట్‌ సొమ్ముకు రెట్టింపు ఇస్తామనడంతో భవిష్యత్‌ అవసరాల కోసం ఈ సంస్థలో డబ్బులు డిపాజిట్‌ చేస్తే డబ్బు ఇవ్వకుండా కార్యాలయాన్ని మూసివేశారని డిపాజిటర్లు లబోదిబోమంటున్నారు. కమీషన్ల కోసం డిపాజిట్‌ చేయించిన ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి వస్తున్న ఒత్తిళ్ల తట్టుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ అహ్మదాబాద్‌ కేంద్రంగా..

బాధితులు వివరాల ప్రకారం... గుజరాత్‌కు చెందిన రాజకుమార్‌ రాయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా యూనిక్‌ మర్కైంటల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ 1996లో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, రియల్‌ఎస్టేట్‌, హాస్పిటాలిటి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూపంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. 2020 వరకు బాగానే వ్యాపారం చేయడంతోపాటు డిపాజిట్‌దారులకు కొందరికి సమయానికి డబ్బులు అందించింది. మిగతా ఇన్సూరెన్స్‌ వ్యాపారాలు అన్ని పక్కనబెట్టి సదరు సంస్థ కేవలం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రోజువారి, నెలవారి డబ్బులు జమచేసే పొదుపు పథకాలను కొనసాగించింది. 500 రూపాయల నుంచి 5 లక్షల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినా, రోజూ, నెల నెలా డబ్బులు జమచేసిన వారికి 73 నెలలకు రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించింది. ఏజెంట్లకు 5 నుంచి 6 శాతం కమీషన్‌ను చెల్లించింది. సేకరించిన డబ్బులతో హోటళ్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారని తెలిసింది.

ఫ డిపాజిట్ల మెచ్యూరిటీ ముగిసినా..

తరువాత కస్టమర్ల డిపాజిట్‌ల మెచ్యూరిటీ గడువు 2020 సంవత్సరలో ముగియడంతో డబ్బులు చెల్లించకుండా తప్పించుకుంటూ చివరకు చేతులెత్తేసింది. కార్యాలయాలకు వెళితే సరైన సమాధానం ఇవ్వలేదు. కరోనాతో సంస్థ నష్టాల్లో ఉందని, హోటళ్లు, సంస్థకు చెందిన భూములు, భవనాలు విక్రయించి డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లిస్తామంటూ సంస్థకు చెందిన కరీంనగర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కస్టమర్లకు చెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాది కాలంగా బాధితులు కరీంనగర్‌ కశ్మీరగ్‌డ్డ ప్రాంతంలోని యూనికు మర్కైంటల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ చుట్టూ తిరిగివేసారి పోతున్నారు. డిపాజిటర్లు డబ్బుల కోసం ఏజెంట్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఏజెంట్లు, డిపాజిట్‌దారులు కలిసి సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడి ఉద్యోగులతో గొడవకుదిగారు. ఎలాంటి లాభం లేకుండా పోయింది. దీంతో కొందరు డిపాజిటర్లు ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదులు చేయగా ఒకరిద్దరు ఏజెంట్లు జైలుకు వెళ్లారు. రాష్ట్రం వ్యాప్తంగా యూనిక్‌మర్కైంటల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ 806 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఆ సంస్థకు చెందిన ఏజెంట్లు, బాధితులు చెబుతున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోనే 10 వేల మంది ఏజెంట్లు, మూడు లక్షల వరకు డిపాజిట్‌దారులు ఉన్నారు. వీరికి సంస్థ 500 కోట్ల వరకు చెల్లించి ఉన్నట్లు తెలిసింది.

ఫ బాధితుల సమావేశం

యూనిక్‌ మర్కైంటల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ బాధితులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులు హాజరయ్యారు. యూనిక్‌ బాధితుల ఉద్యమ నాయకురాలు పూజిత మాట్లాడుతూ బాధితులకు డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని ఆమె స్పష్టం చేశారు. ఏఐఎఫ్‌బీ సీనియర్‌ నాయకులు అంబటి జోజిరెడ్డి బాధితుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమాన్ని, బాధితులను పక్కదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేయిస్తామని, బాధితులకు రక్షణ కవచంలా నిలబడతామని తెలిపారు. పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులను మోసం చేసే వారెవరైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఎర్రం రాజా రెడ్డి బాధితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. బాధితులకు పూర్తి స్థాయి లీగల్‌ సపోర్ట్‌ అందిస్తామని, అవసరమైతే కోర్టుల్లో పోరాటం చేస్తామని న్యాయవాది పి రామారావు తెలిపారు.

ఫ కూతురు పెళ్లి కోసం నెలకు 5 వేలు డిపాజిట్‌ చేశాను

- మచ్చ సత్యనారాయణ, కొత్తపల్లి

రోజు కూలీ చేసుకుని బతుకుతాను. నాకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పెళ్లి ఖర్చులకు అక్కరకు వస్తాయని చెప్పి యూనిక్‌ సంస్థలో నెలకు ఐదు వేల రూపాయల వంతున 3 ఏళ్లపాటు 1.80 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేశాను. గత డిసెంబరులో యూనిక్‌ సంస్థ డబ్బులు ఇవ్వడంలేదని తెలియడంతో డిపాజిట్‌ చేయటం మానుకుని, డబ్బులు ఇవ్వాలని ఆ సంస్థ మేనేజర్‌ను అడిగాను. పది రోజులు, నెల అంటూ దాటవేస్తున్నారు. ఎలాగైనా నాకు న్యాయం చేసి, ఆదుకోవాలి. నా బిడ్డ పెళ్లికి ఉంది.

ఫ ముగ్గురు కస్టమర్లకు రూ. 1.60 లక్షలు చెల్లించాను

- యూనిక్‌ సంస్థ ఏజెంట్‌....

యూనిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలో పదేళ్లుగా ఏజెంట్‌గా పనిచేస్తున్నాను. 25 మందితో 20 లక్షలపైనా డిపాజిట్లు చేయించాను. ఆరేళ్లకు రెట్టింపు డబ్బులు ఇస్తామంటే సభ్యులను చేర్పించాను. ఇంత వరకు ఒక్కరి డిపాజిట్‌ కూడా తిరిగి చెల్లించలేదు. కస్టమర్లు ఒత్తిడికి గురి చేయటంతో, కొందరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగాలేక పోవటంతో ఒక వ్యక్తి వద్ద అప్పుతీపుకుని లక్షా 60 వేల రూపాయలు ముగ్గురు కస్టమర్లకు చెల్లించాను. ఇంటికి వస్తున్న కస్టమర్లను తప్పించుకు తిరుగుతున్నాను.

ఫ జైలుకు వెళ్లాను

- యూనిక్‌ సంస్థ మరో ఏజెంట్‌

కస్టమర్లు మమ్మల్ని నమ్మి లక్షల రూపాయలు డిపాజిట్‌ చేశారు. డబ్బులు తిరిగి సంస్థ నుంచి రాకపోవడంతో నాపై డిపాజిటర్లు కేసులు పెట్టారు. 60 రోజులు జైలుకు వెళ్లి వచ్చాను. 120 మంది కస్టమర్లతో దాదాపు 90 లక్షలు యూనిక్‌ సంస్థలో డిపాజిట్‌ చేయించాను. 2020 వరకు మెచ్యూరిటీ గడువు ముగిసిన వారికి 45 రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమచేశారు. ఆ తరువాత డబ్బులు ఇవ్వడంలేదు. కస్టమర్ల వద్ద సేకరించిన డబ్బులను హోటళ్లు, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన సంస్థకు నష్టం రావడంతో చేతులెత్తేసింది. కరీంనగర్‌ కార్యాలయానికి నిత్యం వందలాది కస్టమర్లు వస్తూపోతున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 01:08 AM