Share News

నెరవేరని ఆశలు

ABN , Publish Date - May 20 , 2026 | 12:41 AM

అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అవుతున్న జగిత్యాల మామిడికి సరియైున గుర్తింపు లభించకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

నెరవేరని ఆశలు

జగిత్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అవుతున్న జగిత్యాల మామిడికి సరియైున గుర్తింపు లభించకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఐదు సంవత్సరాల కిందట జగిత్యాల జిల్లా మామిడిని ఎక్స్‌పోర్ట్‌ జోన్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో అమలులోకి రాకుండా పోయింది. ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లో భాగంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు కావాల్సి ఉండగా ఆ దిశగా కార్యాచరణ జరగలేదు. దీంతో ప్రతీ సంవత్సరం జగిత్యాల జిల్లా మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు దశాబ్దాలకు పైగా రైతులు పండిస్తున్న జగిత్యాల మామిడి అంతర్జాతీయ మార్కెట్‌ను కలిగియుంది. అయితే అంతర్జాతీయ స్థాయి భౌగోళిక గుర్తింపు కోసం రైతులు సంవత్సరాల తరబడి ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలకు చెందిన మామిడి ఉత్పత్తుదారుల సంఘం బ్రాండింగ్‌, జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌ కోసం చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. జగిత్యాల మార్కెట్‌కు పేటెంట్‌ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ పేటెంట్‌ కల్పించడానికి రైతులు ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలరాజును పండించే రైతుల ఆశలు నెరవేరకపోవడంతో నిరుత్సాహం చెందుతున్నారు.

ఫ యేటా కోట్లలో వ్యాపారం..

జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో ప్రతీ సంవత్సరం రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందన్న అంచనా ఉంది. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 10 టన్నుల చొప్పున 3లక్షల నుంచి 4 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. దీంతో పాటు చుట్టుపక్కల జిల్లాలయిన నిజామాబాద్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, నిర్మల్‌, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి జగిత్యాల మార్కెట్‌కు మామిడిని తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మామిడి కాయలను ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, చంఢీగఢ్‌, హర్యానా, పంజాబ్‌, నాగ్‌పూర్‌, ఉత్తరప్రదేశ్‌, మీరట్‌, లక్నో, రాజస్థాన్‌, చంద్రాపూర్‌, వార్ధా వంటి ప్రాంతాలకు లారీల్లో, రైలులో తరలిస్తుంటారు. సీజన్‌లో ప్రతి నిత్యం 30 నుంచి 50 లారీల్లో మామిడి కాయలు వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కూలీలు లోడింగ్‌, అన్‌ లోడింగ్‌, ప్యాకింగ్‌ తదితర పనులను నిర్వహిస్తుంటారు. జగిత్యాల మార్కెట్‌లో 56 మంది ట్రేడర్లు, 85 మంది కమీషన్‌ ఏజెంట్లున్నారు. ఎంతో రుచికరంగా ఉండే జగిత్యాల మామిడిని ఢిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. అయినప్పటికీ ఇక్కడి రైతులకు ప్రతీ సంవత్సరం గిట్టుబాటు ధరలు లభించక నష్టాలే మిగులుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్న దళారులంతా సిండికేట్‌గా మారి క్వాలిటీ, క్యాష్‌ కటింగ్‌ పేరుతో ధర అమాంతం తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఫమార్కెట్‌లో లభిస్తున్న మామిడి రకాలు..

జగిత్యాల మార్కెట్‌లో ప్రధానంగా బంగినపల్లి మామిడి లభిస్తుంది. దీంతో పాటు దసేరి, కల మామిడి, ఇమామ్‌ పసందు, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, చిన్న నీలం, పెద్ద నీలం అను మామిడి రకాలను రైతులు పండిస్తారు. ఇందులో బంగినిపల్లి రకానికి కిలో ఒక్కంటికి రూ. 40 వరకు లభిస్తుంది, ఇతర రకాలు రూ. 30 నుంచి రూ. 35 వరకు కిలో చొప్పున రైతుకు ధర దక్కుతుంది.

ఫనెరవేరని బ్రాండింగ్‌ ఆశలు

జగిత్యాల మామిడికి బ్రాండింగ్‌తో పాటు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు ఇస్తే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలున్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల మ్యాంగో లోగో ఆవిష్కరించారు. మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా బ్రాండింగ్‌ చేస్తామని హామీనిచ్చారు. మామిడికి ప్రత్యేక గుర్తింపు పొందేలా జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ కూడా తీసుకువస్తామన్నారు. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగిత్యాల మామిడికి గుర్తింపు విషయమై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఫఎక్స్‌పోర్ట్‌ జోన్‌గా గుర్తించినా దక్కని ఫలితం..

జగిత్యాల జిల్లాలో మామిడి సాగు, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2022లో ఎక్స్‌పోర్ట్‌ జోన్‌గా గుర్తించింది. ఈ మేరకు ఎక్స్‌పోర్ట్‌ జోన్‌ కార్యాచరణ మొదలు పెట్టకపోవడంతో రైతులకు లాభాలు రావడం లేదన్న అభిప్రాయాలున్నాయి. సీజన్‌లో రైతుల నుంచి వ్యాపారులు మామిడిని కొనుగోలు చేయడం, ప్రాసెసింగ్‌ చేయడం, నేరుగా ప్రభుత్వం పలు రకాల పరీక్షలు నిర్వహించి అనుమతులు ఇస్తే ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే వీలు కలుగుతుందని రైతులు అంటున్నారు. దీని ద్వారా రైతులకు మంచి ధరతో పాటు వ్యాపారులకు సైతం లాభాలు కలిసివస్తాయంటున్నారు. మామిడి తోటల రైతులు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు జగిత్యాల కేంద్రంగా జాతీయ మామిడి బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ రైతుల్లో వినిపిస్తోంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలని మామిడి రైతులు కోరుతున్నారు.

జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి

-రాంరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు

జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మామిడికి ప్రత్యేక గుర్తింపు దక్కాలి. పసుపు బోర్డు మాదిరిగానే జగిత్యాల కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ఎక్స్‌పోర్ట్‌ జోన్‌లో భాగంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు బ్రాండింగ్‌, జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌ ఇవ్వాలి. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు.

Updated Date - May 20 , 2026 | 12:41 AM