Share News

యథేచ్ఛగా గ్యాస్‌ దందా..

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:13 AM

జిల్లాలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా యఽథేచ్ఛగా సాగుతోంది. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన కొందరు ఇదే పనిగా రాయితీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇళ్లమధ్యనే రహస్యంగా పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను దర్జాగా నింపుతున్నారు. కరీంనగర్‌తోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంటల్లో జోరుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు కన్నేయకపోవడంతో అందినకాడికి దండుకునే పనిలో కొందరు నిమగ్నమయ్యారు.

యథేచ్ఛగా గ్యాస్‌ దందా..

- జనావాసాల్లో దర్జాగా రీఫిల్లింగ్‌

- తనిఖీలు లేక విచ్చలవిడి వ్యవహారం

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

జిల్లాలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా యఽథేచ్ఛగా సాగుతోంది. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన కొందరు ఇదే పనిగా రాయితీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇళ్లమధ్యనే రహస్యంగా పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను దర్జాగా నింపుతున్నారు. కరీంనగర్‌తోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంటల్లో జోరుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు కన్నేయకపోవడంతో అందినకాడికి దండుకునే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. రెండింత లాభాలొస్తుండడంతో ఈ వ్యాపారాన్ని నమ్ముకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ దందా వెనుక భారీగా ఆపదలు పొంచి ఉన్నా తమకేమి పట్టనట్లు వారి పనిని కానిచ్చేస్తున్నారు. దృష్టి పెట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మూడు పెద్ద సిలిండర్లు.. ఆరు చిన్న సిలిండర్లనే తీరున ఈ దందా కొనసాగుతోంది.

ఫ పొంచి ఉన్న ప్రమాదం..

అక్రమ రీఫిల్లింగ్‌తో ప్రమాదాలు జరిగే అవకాశముంది. వ్యాపారులు వీటిని పట్టించుకోవడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎక్కువగా ప్రధాన రహదారులపై ఉన్న దుకాణాల వెనుకభాగాల్లో ఈ దందాను నడిపిస్తున్నారు. కొందరు వాహనాల్లోనూ సబ్సిడీ ఎల్‌పీజీ నింపుతున్నారు. ఫిల్లింగ్‌ సమయంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది. చిన్న వాటిలో నింపేటప్పుడు నికర బరువును మించి నింపితే విస్ఫోటనం జరిగే ప్రమాదముంది. ఎక్కువగా కార్మికులు, బ్యాచిలర్స్‌గా ఉన్న వారి కోసం 2 లేదా 5 కిలోల బరువున్న వాటిని నింపుతున్నారు. 14 కిలోల గృహ సిలిండర్‌నుంచి చిన్నవాటిలోకి రీఫిల్లింగ్‌ను ప్రత్యేకమైన పరికరాల్ని ఉపయోగించి చేస్తున్నారు. అయితే జిల్లాలో వీటిని వినియోగించడానికి అనుమతులు తీసుకోవాలి. నిబంధనల ప్రకారంగా వీటిని ఏర్పాటు చేయాలి. కానీ ఏ ఒక్కరు నిబంధనల్ని పాటించడం లేదు. అనుమతుల జోలికి వెళ్లకుండా అందినకాడికి వ్యాపారాన్ని సాగించేవారు రోజుకింతగా పెరుగుతున్నారు.

ఫ పక్కదారిపై చర్యలేవి.?

రాయితీ ద్వారా గృహాలకు అందే 14 కిలోల సిలిండర్లనే వ్యాపారులు ఈ దందా కోసం వినియోగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజులో 100 నుంచి 150 సిలిండర్లు పక్కదారి పడుతున్నట్లు గతంలోనే పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇళ్లలోకి వాడే వాటిని హోటళ్లకు వినియోగిస్తూ రాయితీ సొమ్మును దుర్వినియోగం చేస్తుండగా ఈ రీఫిల్లింగ్‌ వ్యవహారంతో మరింత మోసం జరుగుతోంది. గ్యాస్‌ సిలిండర్ల అక్రమ నిల్వ, మళ్లింపు, అనధికార వ్యాపారం వంటి ఉల్లంఘనలకు సంబంధించి సెక్షన్‌ 7 కింద కఠినమైన చర్యలను తీసుకునే అధికారం పౌరసరఫరాల శాఖ అధికారులకుంటుంది. సెక్షన్‌ 6ఏ ప్రకారం సామగ్రిని జప్తు చేసి కేసులు నమోదు చేసే వీలుంటుంది. ముఖ్యంగా నింపడం, నిల్వ, రవాణా, భద్రతకు సంబంధించి నిబంధనల్ని అతిక్రమిస్తే రూల్‌43 ప్రకారం నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. జిల్లాలో దాడులు చేసిన దాఖలాలు లేవు. ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, పౌరసరఫరాల అధికారులు నిఘా పెట్టి అక్రమ రీఫిల్లింగ్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 01:13 AM