చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:02 AM
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తోంది. గత యేడాది లక్ష్యంలో సుమారు 50 శాతం మాత్రమే పంపిణీ చేయగా ఈసారి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
జగిత్యాల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తోంది. గత యేడాది లక్ష్యంలో సుమారు 50 శాతం మాత్రమే పంపిణీ చేయగా ఈసారి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 275 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 19,220 మంది సభ్యులున్నారు. ఇందులో 88 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4,217 మంది మహిళలు, 187 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 15,003 మంది పురుష మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 511 గ్రామ పంచాయతీ చెరువులకు 3,130 హెక్టార్ల విస్తీర్ణం, 185 డిపార్ట్‌మెంట్ చెరువులకు 15,162 హెక్టార్ల విస్తీర్ణం ఉంది.
ఫసమయం మించిపోతున్నా...
మూడేళ్ల క్రితం వరకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఏప్రిల్ నెలాఖరులో టెండర్ల ప్రకటన విడుదల చేసి మే రెండో వారంలో టెండర్లు ఖరారు ప్రక్రియ పూర్తి చేసేవారు. రెండేళ్లుగా ఆలస్యం అవుతుండడంతో లక్ష్యంలో 50 శాతం మాత్రమే పంపిణీ చేశారు. ఈ సారైనా వంద శాతం లక్ష్యం మేరకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తారని మత్స్యకారులు భావించినా ఇప్పటికీ పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. రెండేళ్లుగా చేప పిల్లలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు పూర్తి బిల్లులు చెల్లించలేదు. అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
ఫఆలస్యమైతే ఎదుగుదలపై ప్రభావం..
చేప కిలో సైజు పెరగాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో వదిలితే ఈ యేడాది డిసెంబరు, వచ్చే యేడాది జనవరి నుంచి చేపలు పట్టుకొని విక్రయించే అవకాశం ఉంటుంది. చేప పిల్లలను ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సెప్టెంబరులో వదిలితే అవి కిలో సైజు రావడానికి ఫిబ్రవరి వస్తుంది. ఇంకా పెరగాలంటే ఏప్రిల్, మే వచ్చేస్తుంది. ఎండల కారణంగా నీరు తగ్గి చేపలు చనిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు అంటున్నారు.
ఫఎల్‌నినో ప్రభావం
మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఈ యేడాది ఎల్‌నినో ఎఫెక్ట్ పడుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడం, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లోకి నీరు చేరకపోవడంతో ప్రభుత్వం చేప పిల్లల పంపిణీపై ఊసెత్తడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సారి ఎల్‌నినో ఎఫెక్ట్‌తో చేప పిల్లల పంపిణీ ఉంటుందా...లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫనగదు బదిలీ పథకం అమలుకు డిమాండ్..
ఈ యేడాది చేప పిల్లలను మత్స్యకారులే కొనుగోలు చేసేందుకు వీలుగా నగదు బదిలీ పథకం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. పంటలను సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న మాదిరిగానే మత్స్యకారులకు నగదు సహాయాన్ని అందించాలంటున్నారు. ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అదేమాదిరిగా మత్స్యకార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తే నాణ్యమైన చేప పిల్లల పెంపకానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నష్టపోయిన కార్మికు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతీ యేటా టెండర్లు నిర్వహించి చేప పిల్లలను పంపిణీ చేయడంతో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని పలువురు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..
- సురేశ్, జిల్లా మత్స్య శాఖ అధికారి
చేప పిల్లల పంపిణీ విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాము. జిల్లాలో చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాము.
జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఇలా..
---------------------------------------------------------------------------------
సంవత్సరం...చెరువు, కుంటల సంఖ్య.... పంపిణీ చేసిన చేప పిల్లలు
---------------------------------------------------------------------------------
2020 - 2021 - 617 - 1.38 కోట్లు
2021 - 2022 - 183 - 10.79 లక్షలు
2022 - 2023 - 695 - 1.04 కోట్లు
2023 - 2024 - 182 - 1.87 కోట్లు
2024 - 2025 - 602 - 76 లక్షలు
2025 - 2026 - 157 - 36.56 లక్షలు