Share News

సాగుపై అయోమయం

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:51 AM

యాసంగిలో వరి సాగు వద్దంటూ రైతులకు సూచించిన అధికారులు, చివరకు వరి విత్తనాల అమ్మకాలపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకున్నారు.

సాగుపై అయోమయం

పెద్దపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో వరి సాగు వద్దంటూ రైతులకు సూచించిన అధికారులు, చివరకు వరి విత్తనాల అమ్మకాలపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రచారం చేస్తున్నా.. వాటికి అవసరమైన విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. వరి సాగు చేయాలా? ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలా? అన్న సందిగ్ధం నెలకొంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకే సరిపోతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ యాసంగి పంటలకు కాలు వల ద్వారా సాగునీరు విడుదల చేయబోమని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నీటి వసతి ఉన్న రైతులు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఫ ఆరుతడి పంటల సాగు

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు ముందుగానే హెచ్చరించారు. యాసంగిలో వరి సాగును తగ్గించి వేరుశనగ, నువ్వులు, కందులు, పెసర్లు, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితుల్లో వరి సాగు చేస్తే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని వివ రించారు. దీంతో కొంతమంది రైతులు అధికారుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంట ల సాగుకు సిద్ధమయ్యారు. అయితే ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

ఫ సబ్సిడీ విత్తనాలేవీ?

ఆరుతడి పంటలు సాగు చేయాలని చెప్పిన అధికారులు.. విత్తనాల పంపిణీపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలు వస్తాయని ఇప్పటివరకు ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాత్రం మార్కెట్లో పూర్తి ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేసి సాగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని రైతులు మాత్రం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తుందో లేదో తెలియక ఎదురుచూస్తున్నారు. సకాలంలో విత్తనాలు అందకపోతే సాగు సమయం దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది రైతులు ప్రత్యామ్నాయ పంట లను పక్కనపెట్టి తిరిగి వరి సాగుకు సిద్ధమవుతున్నారు.

ఫ వరి విత్తనాల అమ్మకాలపై సడలింపు

కొద్దిరోజుల క్రితం వరకు వరి సాగు చేయవద్దని సూచించడంతో పాటు వరి విత్తనాల అమ్మకాలను కూడా అధికారులు నిలిపివేయించారు. అయితే రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. వరి విత్తనాల అమ్మకాలు, పంపిణీపై ఆంక్షలను సడలించారు. అయితే రైతులు తమకున్న భూమిలో మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే వరి సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. సొంత బోర్లు, బావులు, ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వారా చివరి వరకు నీరు అందించగలిగే రైతులే వరి సాగు చేపట్టాలని చెబుతున్నారు. అయినప్పటికీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే వరి పొట్ట దశలో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఫ జలాశయాల్లో తాగు అవసరాలకే నీరు

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకే సరిపోతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని తేల్చిచెబుతున్నారు. సాగునీటి కోసం కాలువలపై ఆధారపడే రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సొంత నీటి వనరులు ఉన్నవారు కూడా నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకుని పంటలు వేసుకోవాలని చెబుతున్నారు.

ఫ వరి సాగు లక్ష్యం లక్ష ఎకరాలు

పెద్దపల్లి జిల్లాలో గత యాసంగిలో 2.17 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. ఈసారి మాత్రం వరి సాగు విస్తీర్ణాన్ని లక్షా 1,115 ఎకరాలకు కుదించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో 24 వేల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న ఈసారి 65 వేల ఎకరాలకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. కూరగాయల సాగును గతంలో ఉన్న 450 ఎకరాల నుంచి ఈ యాసంగిలో 2 వేల ఎకరాలకు పైగా విస్తరించాలని నిర్ణయిం చారు. ఆరుతడి పంటల సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫ మొదలైన వరి నారుమళ్లు

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరికోతలు పూర్తిచేసిన రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకుంటుండగా, ఇంకా కోతలు పూర్తికాని రైతులు కూడా నారుమడుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌లో నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒకవైపు ఆరుతడి పంటల సాగు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం.. మరోవైపు సబ్సిడీ విత్తనాల కొరత.. ఇంకోవైపు కాలువల ద్వారా సాగునీరు అందదనే పరిణామాల మధ్య యాసంగి సాగుపై రైతులు తర్జనభర్జన పడుతున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:51 AM