Share News

నేతన్నల ఉపాధిపై సందిగ్ధం

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:49 AM

సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్లు బతుకు భరోసాను ఇచ్చాయి.

నేతన్నల ఉపాధిపై సందిగ్ధం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్లు బతుకు భరోసాను ఇచ్చాయి. ప్రభుత్వ ఆర్డర్లతో సంవత్సరంలో 8 నెలల వరకు కార్మికులకు పని దొరుకుతోంది. ఈనెల చివరి వరకు స్వశక్తి చీరల ఉత్పత్తి పూర్తవుతుంది. ప్రభుత్వం మళ్లీ కొత్త ఆర్డర్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికుల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం మళ్లీ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తుందనే సందిగ్ధం వెంటాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న స్వశక్తి చీరలతో సిరిసిల్లకు బ్రాండ్‌ ఇమేజ్‌ రావడమే కాకుండా కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2017 నుంచి 2023 సంవత్సరం వరకు బతుకమ్మ చీరల ఉత్పత్తితో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధినిచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలిపివేసింది. మళ్లీ సిరిసిల్ల నేత కుటుంబాల్లో పాత పరిస్థితులు పునారావృతమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు చీరలు చొప్పున స్వశక్తి మహిళలకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇవ్వడంతో మళ్లీ పరిశ్రమలో కార్మికులకు పని లభించింది. తెలంగాణలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కలెక్టర్లు, ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. అదే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిలకపచ్చ చీరలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేరాయి.

సిరిసిల్లలో 6.33 కోట్ల మీటర్ల ఆర్డర్లు

స్వశక్తి మహిళకు చీరలు.. నేతన్నలకు ఉపాధిని అందించే దిశగా చీరల వస్త్ర ఉత్పత్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా మరమగ్గాల పరిశ్రమకు రూ.334 కోట్ల నిధులు కేటాయించింది. 6.33 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు అందించారు. సిరిసిల్లలో దాదాపు 30352 వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 133 మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(మ్యాక్స్‌)ల ద్వారా 11 వేల మరమగ్గాలపైన ఉత్పత్తి జరుగుతుండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేలమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకు 6 కోట్ల మీటర్లకు పైగా బట్ట ఉత్పత్తి పూర్తి చేశారు. త్వరలో వస్త్ర ఉత్పత్తి సేకరణ కూడా పూర్తవుతుంది. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న 95 లక్షల చీరల్లో 5 లక్షల వరకు 9మీటర్ల గోచి చీరలు పెద్దవాళ్లకు అందించడానికి ఉత్పత్తి చేశారు. సిరిసిల్లతోపాటు ఇతర జిల్లాలో ఉన్న కార్మికులకు కూడా ఆర్డర్లు ఇచ్చారు. ప్రభుత్వ ఆర్డర్ల ప్రక్రియ ఈనెలతో ముగిసిపోనుండడంతో మళ్లీ ఆర్డర్లు ఎప్పుడు వస్తాయనే సందిగ్ధంలో వస్త్ర ఉత్పత్తిదారులు, కార్మికులు ఉన్నారు.

జిల్లాలో చీరల పంపిణీ ఏర్పాట్లు

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సంవత్సరానికి రెండు చీరలు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టగా, దానిలో రెండో చీర కానుకను అందించనున్నారు. ఈసారి రెండో చీర చిలకపచ్చ రంగు డిజైన్లు చూడముచ్చటగా సిద్ధం చేశారు. మొదటిసారి పాలపిట్ట రంగు చీరను కేవలం స్వశక్తి సంఘాల్లో ఉన్న సభ్యులకు మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి రేషన్‌ కార్డులో ఉన్న కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలను అందించడానికి ఏర్పాటు చేశారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్‌ వివరాలు చూపించి చీరలను పొందవచ్చు. సెర్ప్‌ సిబ్బంది ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి చీరలను అందిస్తారు. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్వశక్తి మహిళలకు రెండు చీరలను యూనిఫామ్‌లాగా ఉండే విధంగా లక్ష్యంగా పెట్టుకొని మొదటి విడతలో ‘పాలపిట్ట’ రంగు డిజైన్‌ చీరలను పంపిణీ చేశారు. దాదాపుగా లక్ష చీరలను పంపిణీ చేశారు. ఈసారి ‘చిలకపచ్చ’ రంగు డిజైన్లతో మహిళలు మురిసే విధంగా చీరలను తయారుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలో 411 గ్రామైక్య సంఘాలు, 10853 స్వశక్తి సంఘాల్లో 1.11 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు మరో 35 వేల మంది సంఘాల్లో లేనివారు ఉన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ చీరలు పంపిణీ చేసే విధంగా జిల్లాకు 1.45 లక్ష చీరలు అవసరం అవుతాయని నివేదిక పంపించగా, జిల్లాకు ఇప్పటి వరకు 1.41 లక్షల చీరలు వచ్చాయి.

Updated Date - Nov 26 , 2026 | 12:49 AM