Share News

రైతు బీమాపై సందిగ్ధం..

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:04 AM

రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకంపై సందిగ్దం నెలకొన్నది.

రైతు బీమాపై సందిగ్ధం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకంపై సందిగ్దం నెలకొన్నది. బీమా గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, రైతు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారం రోజుల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లో 12 మంది మృతి చెందడం కలవరానికి గురి చేస్తున్నది. యేటా ఆగస్టు 15వ తేదీకి ముందే వ్యవసాయ భూములు పట్టాలు కలిగిన రైతుల పేరిట ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు చెల్లించక పోవడంలో ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతున్నది. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకవచ్చిన ప్రభుత్వం దానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించ లేదు. ఈ పథకాన్ని తీసుక వస్తున్నందున, రైతు బీమా పథకం ఉండక పోవచ్చనే ప్రచారం జరుగుతున్నది.

ఫ రైతు బీమాకు ప్రాధాన్యం

రైతు కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్ధేశంతో 2019 ఆగస్టు 15న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుక వచ్చింది. రైతులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా కూడా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించి భారత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకొంది. రైతు కుటుంబానికి అకస్మాత్తుగా రైతు మరణం తర్వాత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందడం వల్ల పంట నష్టాలు, అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు కొంత ఊరట లభించింది. ఈ పథకం కింద గతేడాది 96,850మంది రైతులకు ప్రభుత్వం రైతుబీమా కల్పించింది. ఒక్కో రైతుకు 3,400 రూపాయల చొప్పున ప్రభుత్వం 32 కోట్ల 92 లక్షల 90 వేల రూపాయల ప్రీమియం చెల్లించింది. బీమా కాలంలో జిల్లాలో 421 మంది రైతులు మృతి చెందగా, ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 21 కోట్ల 5 లక్షల రూపాయల పరిహారం అందింది. ఈ గణాంకాలే రైతు కుటుంబాలకు ఈ పథకం ఎంతటి భరోసానిస్తుందో చెబుతున్నాయి.

ఫ 12 కుటుంబాల పరిస్థితి ఏమిటి?

బీమా గడువు ముగిసిన వెంటనే రైతుల మరణాలు చోటు చేసుకో వడంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. రైతు బీమా కొనసాగుతున్నదా? కొత్త పాలసీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందా? విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందు తున్నారు. 5 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్న నమ్మకంతో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది రైతు బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. సాధారణంగా కొత్త బీమా కాలానికి ముందుగానే ప్రీమియం చెల్లింపులు, రైతుల వివరాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి గడువు ముగిసే వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో సందేహాలకు తావిస్తోంది. అసలు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా, లేదా అనే సంశయం రైతుల్లో నెలకొన్నది.

ఫ పథకం అమలుపై స్పష్టత ఇవ్వాలి..

రైతు బీమా పథకం అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రీమియం చెల్లింపు పరిస్థితి, కొత్త బీమా కాలం, అర్హులైన రైతుల సంఖ్య, గడువు ముగిసిన తర్వాత జరిగిన మరణాలకు వర్తించే నిబంధనలు, పెండింగ్‌ క్లెయిమ్‌ల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే జిల్లాలో మరణించిన 12 మంది రైతుల కుటుంబాలకు బీమా పరిహారం అందుతుందా? లేదా? అన్నది ప్రభుత్వం తక్షణమే తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రైతు బీమా పథకం అమలు గురించి స్పష్టత ఇవ్వాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 01:05 AM