Share News

అంగన్‌వాడీలపై అనధికార పెత్తనం

ABN , Publish Date - Sep 13 , 2026 | 02:18 AM

జగిత్యాలలో ఇటీవల అంగన్‌ వాడీ టీచర్లపై అనధికార వ్యక్తుల ఆగడాలు పెరుగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై అనధికార వ్యక్తుల పెత్తనం పెరుగుతోందన్న ఆరోపణలు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్ల భర్తలు అంగన్‌వాడీ టీచర్ల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు అంగన్‌వాడీ టీచర్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు.

అంగన్‌వాడీలపై అనధికార పెత్తనం
జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు

- పలువురు కౌన్సిలర్ల భర్తల జోక్యంపై టీచర్ల ఫిర్యాదులు

- రాజకీయ కారణాలతో వేధింపులంటూ ఆరోపణలు

- సంఘటనపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరా

జగిత్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలలో ఇటీవల అంగన్‌ వాడీ టీచర్లపై అనధికార వ్యక్తుల ఆగడాలు పెరుగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై అనధికార వ్యక్తుల పెత్తనం పెరుగుతోందన్న ఆరోపణలు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్ల భర్తలు అంగన్‌వాడీ టీచర్ల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు అంగన్‌వాడీ టీచర్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కారణాలతో కొందరు టీచర్లను వేధిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి.

ఫరాజకీయ మద్దతు ఇవ్వలేదని..

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదన్న కారణంతో ఓ అంగన్‌వాడీ టీచర్‌ను అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త ఇబ్బందులకు గు రిచేస్తున్నారని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ కారణాలను తెరపైకి తెచ్చి ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆమె వాపోయినట్లు తెలిసింది. ఉద్యోగ విధులకు సంబంధం లేని వ్యక్తులు తనపై పెత్తనం చెలాయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో మరికొందరు అంగన్‌ వాడీ టీచర్లు సైతం ఇబ్బందులకు గురవుతున్నట్లు సంబంధిత వర్గాలు చర్చించు కుంటున్నాయి.

ఫపోషణ్‌ అభియాన్‌లోనూ వివాదం...

నాలుగు రోజుల క్రితం ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌కు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ మున్సిపల్‌ కౌన్సిలర్‌ భర్త అక్కడికి వచ్చి టీచర్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో అక్కడున్న అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళనకు గురైనట్లు తెలిసింది. విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులతో అనధికార వ్యక్తులు ఈ తరహాలో వ్యవహరించడంపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సంబంధం లేని వ్యక్తులు కేంద్రాల్లోకి వచ్చి ఆదేశాలు ఇవ్వడం, రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వ్యవస్థను పక్కనపెట్టి రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయిస్తే తాము ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఫఎంపీ అసహనం...

జగిత్యాలలో ఇటీవల జరిగిన పలు సంఘటనలను బాఽధిత అంగన్‌వాడీ టీచర్లు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దృష్టికి వెళ్లారు. బాధిత అంగన్‌వాడీ టీచర్‌కు ఆయన ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగులు ఎలాంటి ఒత్తిళ్లు, వేధింపులు లేకుండా విధులు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఫమహిళా ఉద్యోగుల భద్రతపై ప్రశ్నలు...

అంగన్‌వాడీ టీచర్లు చిన్నారుల సంరక్షణతో పాటు పోషకాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి మహిళా ఉద్యోగుల విధుల్లోకి రాజకీయ జోక్యం, అనధికార వ్యక్తుల పెత్తనం వస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. టీచర్లు చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు, జరుగుతున్న సంఘటనలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు స్వతంత్రంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. మహిళా ఉద్యోగుకు భద్రమైన పని వాతావ రణం కల్పించాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంఘటనలు, ఫిర్యాదులపై శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

-భాస్కర్‌, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి

జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు నిబంధనల ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వరించాల్సి ఉంటుంది. విధులకు ఆటంకం కలిగించడం, అనధికార జోక్యం వంటి ఫిర్యాదులపై విచారణ జరపడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి పరిస్థితిని తీసుకువెళ్తాం.

జగిత్యాలలో ఇటీవల జరిగిన పలు సంఘటనలు..

ఫ జిల్లా కేంద్రంలోని పలు అంగన్‌వాడీ టీచర్లపై మున్సిపల్‌ కౌన్సిలర్ల భర్తలు అనవసరంగా జోక్యం చేసుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారని ఇటీవల జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌కు పలువురు టీచర్లు ఫిర్యాదు చేశారు.

ఫ జగిత్యాలలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ను అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తనకు మద్దతు పలకలేదని, ఓట్లు వేయించలేదని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫ రెండు రోజుల క్రితం ఓ అంగన్‌ వాడీ కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌కు సంబంధించిన కార్యక్రమం జరుగుతుండగా ఓ మున్సిపల్‌ కౌన్సిలర్‌ భర్త వచ్చి టీచర్‌పై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

Updated Date - Sep 13 , 2026 | 02:18 AM