అందని యూరియా.. అన్నదాతల ఆందోళన
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:50 AM
యూరియా కోసం రైతులు యాప్‌లో నమోదు చేసుకున్న సకాలంలో అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు యాప్‌లో నమోదు చేసుకున్న సకాలంలో అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన యూరియా సరఫరా చేయక పోవడం వల్ల ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లోని ప్యాక్స్ కార్యాలయంలో ఆదివారం చోటు చేసుకుంది. రైతుల కథనం మేరకు.. తిమ్మాపూర్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఆదివారం ఎరువును సరఫరా చేసేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా పంపిణీలో జాప్యం నెలకొంది. దాంతో ఆగ్రహించిన రైతులు లోనికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆవేశంలో బల్లపై ఉన్న క్యాలిక్యులేటర్‌ను విసిరి వేయడంతో ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైతులకు శాంతింపజేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఉదయం నుంచి పనులు వదులుకుని పడిగాపులు కాస్తున్నామని ఆగ్ర హించారు. సాంకేతిక లోపం తలెత్తితే తమనెందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు అదుపులోకి తీసుకున్నారు. యూరియా అందక తాము అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యాప్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు తమకు ఎరువు లను అందించాలని రైతులు కోరారు.