Share News

తీరనున్న కష్టాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:16 AM

వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షం కలిగింది. 58.8 కిలో మీటర్ల నిడివిగల ఈ రోడ్డును 2,395 కోట్ల రూపాయలతో నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

తీరనున్న కష్టాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షం కలిగింది. 58.8 కిలో మీటర్ల నిడివిగల ఈ రోడ్డును 2,395 కోట్ల రూపాయలతో నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నిజామాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌ పట్టణాలకు బాసర, షిర్డీ, కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాలకు నిత్యం ప్రయాణికుల వాహనాలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన లారీలు, ట్రక్కులు వందలాది సంఖ్యలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి. 58.8 కిలో మీటర్ల దూరం ప్రయాణానికి గంటన్నరకు పైగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుండేది. ప్రస్తుతం ఈ రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించనుండడంతో ప్రయాణం 45 నిమిషాలకు తగ్గిపోనున్నది. ఈ రోడ్డుతోపాటు జగిత్యాల నుంచి మంచిర్యాలకు 68.3 కిలోమీటర్ల రహదారి, జగిత్యాల నుంచి ఆర్మూర్‌ వరకు 63.6 కిలోమీటర్ల రోడ్డును నాలుగులైన్లకు విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతోనిజామాబాద్‌, మంచిర్యాల వరకు జాతీయ రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. జగిత్యాల నుంచి మంచిర్యాల రోడ్డుకు 2,731 కోట్లు, జగిత్యాల నుంచి ఆర్మూర్‌ రోడ్డుకు 2,472కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. 7,597 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మూడు జాతీయ రహదారులను నాలుగులైన్ల రోడ్లుగా విస్తరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికి వరంగా మారింది. కేంద్రమంత్రి బండిసంజయ్‌కుమార్‌ ఈ రోడ్ల అభివృద్ధి కోసం పలుమార్లు కేంద్ర రవాణా రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. వీటి అభివృద్ధి ఆవశ్యకతను వారికి వివరించిన ఫలితంగా కేంద్ర కేబినెట్‌ వీటికి ఆమోదం తెలిపింది. రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు, వాణిజ్యం వృద్దిచెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

ఫ 35 కిలోమీటర్ల మేర బైపాస్‌ రోడ్లు

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డును బీవోటీ పద్దతిలో విస్తరించనున్నారు. దారిలో ఉన్న ప్రధాన మండల కేంద్రాల వద్ద రోడ్డుపై వ్యాపార వాణిజ్యాలు ఇప్పటికే విస్తరించి ఉండి ఎక్కువ రద్దీగా ఉంటూ ప్రజలు విలువైన భవనాలు నిర్మించుకొని జీవిస్తున్నారు. అలాంటి వారికి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు సుమారు 35 కిలో మీటర్ల మేరకు ఆయా ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. కొత్తపల్లి, గంగాధర తదితర ప్రధాన కేంద్రాలకు బైపాస్‌ రోడ్లు ఏర్పడనున్నాయి. 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ఈ రోడ్డును డిజైన్‌ చేస్తారు. కేంద్ర కేబినెట్‌ ఈ జాతీయ రహదారులను నాలుగులైన్ల రోడ్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తున్నందుకు కరీంనగర్‌ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, రవాణా రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 01:16 AM