Share News

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత...

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:34 PM

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత (త్రీ టైర్‌ సెక్యూరిటీ) ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత...

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత (త్రీ టైర్‌ సెక్యూరిటీ) ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరం నుంచే భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషిధించామని సీపీ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వైపు వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టామని, జగిత్యాల-కరీంనగర్‌ మార్గంలో ప్రయాణించే వారు పోలీసుల సూచనలు పాటించాలని సీపీ కోరారు.

ఫ మొదటి గేట్‌: పోలీసు అధికారులు, మున్సిపల్‌ అధికారులు, విధుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే అనుమతి.

ఫ రెండో గేట్‌: అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు ఈ గేట్‌ నుంచి ప్రవేశం ఉంటుంది. వీరందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి.

ఫ పార్కింగ్‌ సౌకర్యం: కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే వాహనాల కోసం నిర్ణీత దూరంలో ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

ఫ నిరంతర నిఘా: కౌంటింగ్‌ కేంద్రం బయట ఎటువంటి గుంపులు ఏర్పడకుండా పుషింగ్‌ పార్టీలను రంగంలోకి దించామని, నగరవ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని సీపీ తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సంబరాలు లేదా నిరసనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీపీ స్పష్టం చేశారు.

ఫ కమిషనరేట్‌ పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలులో...

మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)సెక్షన్‌ 163 అమలు చేస్తున్నట్లు సీపీ గౌస్‌ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 13 ఉదయం 6 నుంచి ఫిబ్రవరి 14 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విధించామన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:34 PM