చెరుకు రైతుకు రవాణా తిప్పలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:48 AM
జిల్లాలోని చెరుకు రైతులకు క్రషింగ్ కష్టాలు యేటా తప్పడం లేదు.
జగిత్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చెరుకు రైతులకు క్రషింగ్ కష్టాలు యేటా తప్పడం లేదు. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ కర్మాగారం (ఎన్డీఎస్ఎల్) పదకొండు ఏళ్ల క్రితం లే ఆఫ్‌తో మూసివేయడంతో ప్రతీ యేటా చెరుకు రైతులు క్రషింగ్ సీజన్లో తిప్పలు పడుతున్నారు. జిల్లాలో పండించిన చెరుకును ఇతర ప్రాంతాలకు తరలించి నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుతం చెరుకు క్రషింగ్ సీజన్ ప్రారంభం కానుండడంతో జిల్లాలోని రైతులు తమ పంటను కామారెడ్డి జిల్లాకు తరలించి రవాణా చార్జీల భారం మోయనున్నారు. రవాణా కోసం టన్నుకు రూ.500 వ్యయం అదనంగా భరించాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఫచెరుకు రైతును వీడని లే ఆఫ్ కష్టాలు
మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగారానికి నష్టాలు వస్తున్నాయన్న సాకుతో 2015 డిసెంబరు 23వ తేదిన లే ఆఫ్ ప్రకటించి కర్మాగారాన్ని మూసివేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పండించిన చెరుకు ఇతర ప్రాంతాలకు తరలించడానికి రవాణా చార్జీలను మోయాల్సి వస్తోంది. జిల్లాలోని చెరుకు రైతులకు సుమారు రూ.3 కోట్ల రవాణా భారం పడుతోంది. జిల్లాలోని పలు గ్రామాల్లో పండించిన చెరుకు ప్రస్తుత క్రషింగ్ సీజన్లో రైతులు కామారెడ్డి జిల్లాలోని పలు ప్రయివేటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. చెరుకు తరలింపునకు ఖర్చులు తడిచి మోపెడవుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రవాణా చార్జీలను భరించలేక ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఫతగ్గిన చెరుకు సాగు...
గతంలో జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా చెరుకు రైతులు సాగు చేసేవారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో చెరుకు పంట సాగు అయినట్లు అంచనాలున్నాయి. ఇందుకు గాను సుమారు 60,000 టన్నుల చెరుకు దిగుబడి వస్తోంది. జగిత్యాల జిల్లా నుంచి కామారెడ్డికి సుమారు 150 కిలో మీటర్ల దూరం చెరుకును తరలించడానికి రైతులకు టన్నుకు సుమారు రూ.500 వరకు ఖర్చు అవుతోంది. టన్ను ఒక్కంటికి రూ.500 చొప్పున జిల్లాలో దిగుబడి అయిన 60 వేల టన్నులకు సుమారు రూ.3 కోట్ల రవాణా భారాన్ని రైతులు భరించాల్సి వస్తోంది. ప్రస్తుత క్రషింగ్ సీజన్లో జిల్లాకు చెందిన చెరుకు రవాణా ఖర్చుల కింద రూ.కోట్లలో నష్ట పోతుండడంతో లబోదిబో మంటున్నారు. రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముత్యంపేట శివారులో గల చక్కర కర్మాగారానికి చెరుకు పంటను తరలించడానికి రైతులకు ఎటువంటి భారం పడేది కాదు. ప్రస్తుతం కష్టనష్టాలకు ఓర్చుకొని పండించిన చెరుకు అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఫసర్కారుపైనే ఆశలు..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు నేతృత్వంలో ఇటీవల హైదరాబాద్‌లో పలువురు చెరుకు రైతులు కలిసి గోడును వెల్లబోసుకున్నారు. జిల్లాలో 1500 ఎకరాల వరకు రైతులు చెరుకును సాగు చేస్తున్నారని, సుమారు 60 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఇక్కడి చెరుకును కామారెడ్డిలోని గాయాత్రీ షుగర్ ఫ్యాక్టరీకి తరలించడానికి అదనపు రవాణా భారాన్ని టన్నుకు కనీసం రూ.500 చొప్పున వ్యయం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరింపజేస్తానని హామీనిచ్చారు. దీంతో ప్రభుత్వం చెరుకు తరలింపు రవాణా చార్జీలను అందిస్తుందని ఆశలు పెంచుకుంటున్నారు.
రవాణా చార్జీల భారం నివారించాలి
-వాకిడి సత్యంరెడ్డి, చెరుకు రైతు, కాంగ్రెస్ కిసాన్‌సెల్ నేత, జగిత్యాల
ముత్యంపేట చక్కర కర్మాగారం పరిధిలోని రైతులు కామారెడ్డి ప్రాంతంలోని కర్మాగారానికి చెరుకు రవాణా చేయడానికి అవుతున్న ఆర్థిక భారాన్ని ప్రభుత్వం నివారించాలి. ముత్యంపేట చక్కర కర్మాగారం లే ఆఫ్‌లో ఉన్నప్పటికీ అధికారుల సూచనల మేరకు రైతులు చెరుకు సాగు చేశారు.
మంత్రి శ్రీధర్‌బాబుకు సమస్యను విన్నవించాం
- కల్వకుంట్ల సుజిత్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రస్తుతం కామారెడ్డికి చెరుకును తరలించడానికి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబుకు సమస్యను విన్నవించాము. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ఆశతో ఉన్నాము.