Share News

పారదర్శకంగా పల్లె లెక్కలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:00 AM

గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి లక్ష్యంగా, సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది.

పారదర్శకంగా పల్లె లెక్కలు

- ప్రతి పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్‌

- త్వరలో ప్రారంభించనున్న ప్రభుత్వం

- గ్రామాల ఐదేళ్ల ప్రణాళికలు నమోదు

- తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా పోర్టల్‌

- నిధులు, పనులు, సంక్షేమ లబ్ధిదారులు వివరాలు

- జిల్లాలో 260 గ్రామపంచాయతీలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి లక్ష్యంగా, సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. పల్లె పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులు సమన్వయం చేసుకునేందుకు దోహదపడే విధంగా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక-2026(జీపీఎస్‌ఏపీ) రూపకల్పన అమలుపై గతంలోనే పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ జారీచేసిన ఉత్తర్వుల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలో వెబ్‌పైట్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించడంతోనే సమగ్ర సమాచారం పల్లె ప్రజలకు చేరువ కానుంది.

వెబ్‌పైట్‌లో సమస్త సమాచారం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయతీ ఊరి పేరు, అనుబంధ గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు, గ్రామం విస్తీర్ణం, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వారి మొబైల్‌ నంబర్లు, జనాభా, పురుషులు, మహిళలు ఇతరులు, కుటుంబాలు, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, రైతులు, వ్యవసాయ భూమి నర్సరీలు, ఎన్ని కిలోమీటర్ల వరకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు ఉన్నాయి, ఇందులో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్‌ కనెక్షన్లు, వీధి దీపాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, మురుగుకాలువల సిస్టం, మార్కెటింగ్‌, వ్యక్తిగత మరుగుదొడ్లు, పార్కులు, సామాజిక భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సంఘాలు, ఉపాధిహామీ పనుల లబ్ధిదారులు ఇలా పూర్తి వివరాలను ఫొటోలు నమోదు చేస్తారు. దీంతోపాటు వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రణాళికలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలకు వచ్చే నిధులు, చేపట్టనున్న పనుల వివరాలు కూడా పొందుపరిచారు. సమగ్ర సమాచారంతో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులు సమన్వయం చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు, పాఠశాలలు, పచ్చదనం పెంపు వంటి పనులను ప్రాధాన్య క్రమంలో అమలు చేసేందుకు ఉపయోగపడుతుంది.

వెబ్‌సైట్‌.. డాష్‌ బోర్డులు

రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక వెబ్‌సైట్‌లో పొందపరుస్తారు. గ్రామ పంచాయతీలకు వెబ్‌సైట్‌, డాష్‌ బోర్డు ఏర్పాటు చేసినట్లే ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రత్యేక వెబ్‌సైట్‌, డాష్‌ బోర్డు కూడా ఉంటుంది. ప్రతినెల పనుల పురోగతి, నిధుల వినియోగం సాధించిన లక్ష్యాలను వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక డాష్‌బోర్డు ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్‌లో సంబంధిత అధికారులు తప్పనిసరిగా సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం పొందపర్చినా పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 135 ప్రకారం చర్యలు తీసుకునే వీలుంది. పంచాయతీల్లో లెక్కలు కూడా పక్కాగా ఉంటాయి. పంచాయతీకి వచ్చే నిధులు వివరాలు కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ ద్వారా సేవలు పొందే వీలు కూడా కల్పిస్తారు. దీంతో కార్యాలయం చుట్టూ తిరిగే పని ఉండదు.

జిల్లాలో మండలాల వారిగా గ్రామాలు, వార్డుల

మండలం జీపీలు వార్డులు

బోయిన్‌పల్లి 23 212

చందుర్తి 19 174

ఇల్లంతకుంట 35 294

గంబీరావుపేట 22 202

కోనరావుపేట 28 238

ముస్తాబాద్‌ 22 202

రుద్రంగి 10 86

తంగళ్లపల్లి 30 252

వీర్నపల్లి 17 132

వేములవాడ 11 104

వేములవాడరూరల్‌ 17 146

ఎల్లారెడ్డిపేట 26 226

మొత్తం 260 2268

Updated Date - Nov 12 , 2026 | 01:00 AM