Share News

పారదర్శకంగా రీసర్వే

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:07 AM

జిల్లాలో గ్రామాల వారీగా భూముల రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ప్రత్యేక చొరవతో గ్రామాల వారీగా భూముల రీసర్వే సమగ్ర శిక్షణ హ్యాండ్‌బుక్‌ను రూపొందించి 500 ప్రతులను ముద్రించారు.

పారదర్శకంగా రీసర్వే

జగిత్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామాల వారీగా భూముల రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ప్రత్యేక చొరవతో గ్రామాల వారీగా భూముల రీసర్వే సమగ్ర శిక్షణ హ్యాండ్‌బుక్‌ను రూపొందించి 500 ప్రతులను ముద్రించారు. రీ-సర్వేలో పాల్గొనే రెవెన్యూ, సర్వే అధికారులు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గిర్దావర్లు, గ్రామ పాలన అధికారులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు వీటిని అందిస్తున్నారు. ఆగస్టు 21న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాల జిల్లాలో నిర్వహించిన సమీక్షలో రీ-సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో సమన్వయం తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో కలెక్టర్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బాధ్యతల విభజనతో పాటు ఎస్‌ఓపీ, 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రీ-సర్వేలో పాల్గొనే ప్రతి స్థాయి అధికారి, ఉద్యోగికి చట్టపరమైన నిబంధనలు, సాంకేతిక విధానాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై ఒకే విధమైన అవగాహన అవసరమని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ గుర్తించారు. కేవలం మౌఖిక సూచనలు, విడివిడిగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, మెమోలు, శిక్షణ తరగతులు మాత్రమే సరిపోవని ప్రతి బృందం చేతిలో ప్రతిరోజూ ఉపయోగించగలిగే సమగ్ర కార్యాచరణ మార్గదర్శిని ఉండాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా భూముల రీ-సర్వే సమగ్ర శిక్షణ హ్యాండ్‌బుక్‌ రూపకల్పన చేశారు.

ఫనిబంధనల నుంచి క్షేత్ర స్థాయి కొలతల వరకు...

చట్టపరమైన నిబంధనల నుంచి క్షేత్రస్థాయి కొలతల వరకు మొత్తం రీ-సర్వే ప్రక్రియను ఇందులో పొందుపరిచారు. పాత రెవెన్యూ రికార్డుల పరిశీలన, గ్రామ సరిహద్దుల నిర్ధారణ, వివిధ పద్ధతుల వినియోగం, క్షేత్ర స్థాయిలో నిజాలు, ప్రభుత్వ భూముల గుర్తింపు, నోటీసుల జారీ, రెవెన్యూ వెట్టింగ్‌, క్వాలిటీ చెక్‌, ల్యాండ్‌ పార్సల్‌మ్యాప్‌, యూఎల్‌పిన్‌/భూధార్‌, అభ్యంతరాలు, అప్పీళ్లు, తుది రికార్డుల తయారీ వంటి అంశాలను దశలవారీగా వివరించారు. ప్రతి చర్యకు డాక్యూమెంటరీ ఎవిడెన్స్‌ భద్రపరచాలని కూడా మార్గదర్శకాలు సూచించారు.

ఫపకడ్బందీగా అమలు

రీ-సర్వేలో ఏ దశ ఎప్పుడు పూర్తి చేయాలి, ఎవరు బాధ్యత వహించాలి, ఏ రికార్డు సిద్ధం చేయాలి అనే అంశాలతో రూపొందించిన 60 రోజుల ప్లానర్‌ ద్వారా మండల, గ్రామ స్థాయిలో పురోగతిని పర్యవేక్షించే అవకాశం కల్పించారు. ‘ప్రతి కొలత వెనుక ఒక రైతు హక్కు ఉంది‘ అనే లక్ష్యంతో రూపొందించిన ఈ హ్యాండ్‌బుక్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి రెఫరెన్స్‌ మాన్యువల్‌గా ఉపయోగపడనుంది. సమీక్షలో వ్యక్తమైన అసంతృప్తిని శిక్షణ, ఎస్‌ఓపీ, కార్యాచరణ ప్రణాళిక, హ్యాండ్‌బుక్‌ రూపంలో కార్యాచరణగా మార్చినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.

ఫభూమి రైతు జీవనాధారం

భూమి కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదని, అది రైతు జీవనాధారమని గుర్తించాలని అధికారులకు సూచించారు. కుటుంబ భవిష్యత్తు, గ్రామ చరిత్ర, తరతరాల వారసత్వానికి ప్రతీకగా వివరిస్తూ భూమిపై హక్కులను స్పష్టంగా గుర్తించడం, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, గ్రామ సరిహద్దులను నిర్ధారించడం, పాత రెవెన్యూ రికార్డులను క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో సరిపోల్చడం, భవిష్యత్తులో వివాదాలకు అవకాశం లేకుండా ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం రీ-సర్వే ప్రధాన లక్ష్యాలుగా వివరించారు. అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా, సాంకేతికంగా, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నం చేసింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక ఆసక్తి, నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వంతో గ్రామాల వారీగా భూముల రీ-సర్వే సమగ్ర శిక్షణ హ్యాండ్‌బుక్‌ను రూపొందించి ప్రచురించింది.

హ్యాండ్‌బుక్‌లో సమగ్ర వివరాలు

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

భూమి కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు..అది రైతు జీవానాధారం. రీ-సర్వేలో ప్రతి కొలత, ప్రతి సంతకం, ప్రతి నోటీసు, ప్రతి ఫోటో, ప్రతి రికార్డు వెనుక ఒక రైతు హక్కు లేదా ప్రభుత్వ భూమి ప్రయోజనం ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం కూడా ఒక కుటుంబ హక్కును, ప్రజా ఆస్తిని ప్రభావితం చేయగలదు. అధునిక సాంకేతికతను పాత రెవెన్యూ రికార్డులు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సమన్వయం చేస్తూ, ఏ అధికారి ఏ దశలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ హ్యాండ్‌ బుక్‌ రూపొందించాం. చదివే పుస్తకంగా కాకుండా, ప్రతి దశలో పరిశీలించాల్సిన కార్యాచరణ మార్గదర్శకంగా ఉపయోగించాలి.

జిల్లాలో భూ రీ-సర్వేలో ఇలా..

ఫ బీర్‌పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలో 605.10 ఎకరాల్లో పది నెలల క్రితం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి విజయవంతంగా పూర్తి చేశారు.

ఫ జిల్లాలో మొదటి దశలో రాయికల్‌, బీర్‌పూర్‌, మల్లాపూర్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, వెల్గటూరు మండలలాల్లో 20 గ్రామాల్లో 21,345.38 ఎకరాల్లో రీ సర్వే నిర్వహించారు. ఇందులో 4,222.14 ఎకరాల్లో రీ సర్వే ఇప్పటి వరకు పూర్తయింది.

ఫ జిల్లాలో ఇటీవల రెండో దశలో వివిధ మండలాల్లోని 70 గ్రామాల్లో భూ రీ-సర్వే చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి దశలోని 20 గ్రామాలు, రెండో దశలోని 70 గ్రామాల్లో భూ రీ-సర్వే జరుగుతోంది.

Updated Date - Sep 17 , 2026 | 01:08 AM