పారదర్శకంగా రైతులకు రాజన్న కోడెల పంపిణీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:12 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గోశాల నుంచి అర్హులైన రైతులకు కోడెలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గోశాల నుంచి అర్హులైన రైతులకు కోడెలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గ్రామంలోని రాజన్న ఆలయ గోశాలలోని 120 జతల కోడెలను బుధవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి కోడెను కట్టే సంస్కృతి ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను దేవాదాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో నిత్యం తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గంలోని మర్రిపల్లిలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల స్థలం గోశాలకు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే గోశాల పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. కోడెలను సన్న, చిన్నకారు రైతులకు పంపిణీ చేస్తున్నామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలోని అర్హులైన రైతులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయ పనులకు వినియోగించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు పశువైద్య, ఆలయ, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాజన్న ప్రసాదంగా స్వీకరించి కోడెలను రైతులు వ్యవసాయ పనులకే వినియోగించాలని సూచించారు. నిరంతరం కోడెలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కోడెలను తనిఖీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీవో కే.ఎస్.బి కుమారి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, వ్యవసాయ, రెవెన్చూ ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.