ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:34 PM
రైతులకు కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు ఎస్పీఎం, సబ్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచుకోవాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి మధుసూదన్ అన్నారు.
హుజూరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు ఎస్పీఎం, సబ్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచుకోవాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి మధుసూదన్ అన్నారు. హుజూరాబాద్ పట్టణం సబ్ స్టేషన్‌లోని డిపార్ట్‌మెంటల్, ప్రైవేట్ ఎస్పీఎం షెడ్లను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ కొనసాగుతున్నందున ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే వెంటనే రైతులకు మరో ట్రాన్స్‌ఫార్మర్ అందించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తతెత్తకుండా అవసరమైన మేరకు రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీటీఆర్ మరమ్మతుల ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఆయన వెంట వరంగల్ చీఫ్ ఇంజనీర్ అశోక్, డీఈ లక్ష్మారెడ్డి, ఏఈ ఎం శ్రీనివాస్ ఉన్నారు.