రైస్‌మిల్లర్ల గుండెల్లో రైళ్లు
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:22 AM
ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్న రైస్‌మిల్లర్లపై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతో మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో ఇద్దరు మిల్లర్లపై కేసులు నమోదు కాగా, మరికొందరు మిల్లర్లపై కేసులు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
- పక్కదారి పట్టిన కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం
- ఇద్దరు మిల్లర్లపై కేసు నమోదు, అరెస్టు
- మరికొన్ని మిల్లర్లపై కేసు నమోదుకు రంగం సిద్ధం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్న రైస్‌మిల్లర్లపై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతో మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో ఇద్దరు మిల్లర్లపై కేసులు నమోదు కాగా, మరికొందరు మిల్లర్లపై కేసులు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్ని రోజు లుగా బకాయిపడిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వాలని, లేదంటే డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారులు మిల్లర్లకు నోటీసులు ఇవ్వడంతోపాటు సమావేశాలు నిర్వహించి చెబుతున్నా వారు పెడ చెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వం కొరఢా ఝుళిపించడం ఆరంభించింది. మిల్లర్లపై ఉదాసీనంగా ఉండరాదని, కఠినంగా వ్యవహరించాలని ప్రభు త్వం కలెక్టర్లను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కలెక్టర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో శాఖాధికారులు పిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదవుతున్నాయి.
2014-15 నుంచి 2023-24 వరకు జిల్లాలో గల రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద 490 కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఇవ్వగా, సదరు మిల్లర్లు నిర్దిష్ట గడువులోపు మర ఆడించి బియ్యం ఇవ్వ కుండా పక్కదారి పట్టించారు. ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్ర యించి సొమ్ము చేసుకున్నారు. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపా రంలో పెట్టుబడులు పెట్టారు. కొందరు బంగారం కొనుగోలు చేయగా, కొందరు విదేశాలకు వెళ్ళి జల్సా చేశారని తెలుస్తోంది. రంగు మారిన ధాన్యాన్ని ఇచ్చారని, తడిసిన ధాన్యం ఇవ్వడం వల్ల దివాలా తీశామంటూ అధికారులు, ప్రభుత్వానికి సాకులు చెబుతూ వచ్చారు. దీంతో పలుమార్లు మిల్లులను తనిఖీ చేసిన అధికారులు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుం టామని హెచ్చరికలు జారీ చేయడంతో 266 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని మర ఆడించి లెవీ పెట్టారు. 47 రైసుమిల్లుల యజమానులు మిగిలిన 222 కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఇవ్వాల్సి ఉండగా తాత్సా రం చేస్తూ వచ్చారు. వారికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా కూడా ధాన్యం ఇవ్వలేదు. దీంతో 25 శాతం జరిమానా విధించడంతో ధాన్యం విలువ 354 కోట్ల రూపాయలకు చేరుకున్నది. రికవరీ చేసే విషయమై ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సదరు మిల్లర్లకు సమయం ఇచ్చినా కూడా ధాన్యం డబ్బులు చెల్లించక పోవడంతో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
ఫ ఏడుగురు యజమానులపై కేసులు నేమోదు..
సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో జిల్లాలో ఏడు రైస్‌మిల్లుల యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం గోదావరిఖని ప్రాంతానికి చెందిన రెండు రైస్‌మిల్లులు, మంథని ప్రాంతం లోని మూడు రైస్‌మిల్లుల యజమానులు, గత ఏడాది సుల్తానాబాద్‌లోని ఒక రైస్‌మిల్లు యజమానిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సుల్తానాబాద్ సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ 19 కోట్ల 89 లక్షల రూపాయల విలువైన 6165.35 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడగా, ఆ మిల్లు యజమానులపై సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సివిల్ సప్లయ్ అధికా రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ మిల్లు యజమానిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అలాగే గురువారం పెద్దపల్లి పట్టణంలో గల విజయశ్రీ రైస్‌మిల్లు 4 కోట్ల 49 లక్షల రూపాయల విలువ చేసే ధాన్యం బకాయి పడగా అతడిపై కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. ఇంకా ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డ రైస్‌మిల్లర్లపై కేసులు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తుం డడంతో బకాయిదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కానీ ఆ అంశం జిల్లా అధికారుల చేతుల్లో లేకపోవడంతో రాజకీయ నేతల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ బ్యాంకు గ్యారంటీలు లేకనే ధాన్యం పక్కదారి..
సీఎంఆర్ కొందరు రైస్‌మిల్లర్లకు వరంగా మారింది. రూపాయి పెట్టుబడి పెట్టకుండానే ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు సీఎంఆర్ కింద గత ప్రభుత్వ హయాంలో ఇస్తూ వచ్చారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే ధాన్యాన్ని ఇవ్వడంతో మిల్లర్లు ఇష్టారా జ్యంగా వ్యవహరించారు. సకాలంలో ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పెట్టలేదు. అధికారుల పర్యవేక్షణ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేకపోవడంతో బకాయిలు ఏళ్లుగా పేరుకుపోయాయి. దీంతో ధాన్యాన్ని రికవరీ చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కూడా ధాన్యం రికవరీ కాలేదు. వారిపై తూతూ మంత్రంగానే చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్‌మిల్లుల సామర్థ్యంలో 25 శాతం బ్యాంకు గ్యారంటీలు తీసుకున్న తర్వాత సీఎంఆర్ కింద ధాన్యం ఇస్తున్నారు. దీంతో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇస్తున్నారు. పేరుకుపోయిన బకాయిల రికవరీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో బకాయిదారులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. తమపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుక వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.