పుర పోరుకు కసరత్తు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:44 AM
మున్సిపల్ పోరుకు అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పోరుకు అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్ధేశం చేసింది. ఈ నేపథ్యంలో 16న ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసుకోవడం, సిబ్బంది నియామకంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున వార్డుకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించారు.
ఫ16న ఫొటోతో కూడిన తుది జాబితా...
మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు తుది జాబితాను ఈనెల 12న విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 10వ తేదీనే తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అయితే ముసాయిదా జాబితాలపై పెద్దఎత్తున వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 13వ తేదీన నూతనంగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలను మున్సిపల్ కమిషనర్లు విడుదల చేస్తారు. ప్రతి వార్డు పరిధిలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ముసాయిదాను టీ-పోల్‌లో అప్‌లోడ్ చేస్తారు. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
ఫటీ-పోల్ యాప్‌లో అప్‌లోడ్...
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాల ముసాయిదా జాబితా ప్రచురణ పూర్తి చేసి ఎన్నికల నిర్వహణ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించనున్నారు. వీటితో పాటు అవసరమైన బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారుల నియామకానికి ఉద్యోగుల వివరాలను టీ-పోల్ యాప్‌లో అప్ డేట్ చేయనున్నారు.
ఫపోలింగ్ సిబ్బంది సిద్ధం..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులు, సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల అధికారులకు విధుల కేటాయింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటును సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈసారి బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. 2005 నుంచి మున్సిపల్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పద్ధతిన పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు నుంచి మూడు చొప్పున బ్యాలెట్ బాక్స్‌లు అంటే మొత్తం పది శాతం అదనంగా కలుపుకొని సుమారు 400 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఫరిజర్వేషన్లపై కసరత్తు...
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, రాష్ట్రంలో కుల గణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇది పూర్తయిన తరువాత బీసీ రిజర్వేషన్లు పూర్తి చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు నిర్ణయించాక మిగితా వాటిని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా బీసీలకు కేటాయిస్తారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ అందులో సగం స్థానాలు మహిళలకు దక్కేలా కసరత్తులు చేస్తున్నారు.
మున్సిపాలిటీ పేరు.....వార్డులు....ఓటర్లు...ప్రతిపాదిత పోలింగ్ స్టేషన్లు
-------------------------------------------------------------------------------------------------------------
ధర్మపురి - 15 - 14,222 - 24
జగిత్యాల - 50 - 96,410 - 149
రాయికల్ - 12 - 13,195 - 24
కోరుట్ల - 33 - 63,741 - 94
మెట్‌పల్లి - 26 - 46,371 - 64
-------------------------------------------------------------------------------------------------------------
మొత్తం - 136 - 2,33,939 - 355
-------------------------------------------------------------------------------------------------------------