Share News

శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:23 AM

వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ హాజర య్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో మే 13న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ముగింపు సమావేశంలో శిక్షణ శిబిరంలో దాదాపు నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్న 120 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు శిక్షణ సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు, సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా శారీరకంగా ధృడపడానికి ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనాలని, వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్‌ క్యాంప్‌లో పాల్గొని ఎంచుకున్న క్రీడల్లో నైపుణ్యం సాధిం చాలని అన్నారు. జిల్లా కేంద్రంలో మరిన్ని క్రీడల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి క్రీడల జిల్లా, పట్టణ అసోసియేషన్‌ల సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు ముందు కురావాలన్నారు. సమ్మర్‌ క్యాంప్‌ల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ గెంట్యాల శ్రీనివాస్‌, కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు అజిత్‌రావు, వేసవి క్రికెట్‌ శిక్షణ శిబరం ఇన్‌చార్జి వంకాయల కార్తిక్‌, సీనియర్‌ క్రీడాకారుడు కీసర నాగరాజు, శిక్షకులు సాయితేజ, అంకం రాజు, వంశీ, సాయి ప్రేమ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:23 AM