పుర పోరు దిశగా
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:36 AM
జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 136 వార్డులున్నాయి. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డులు, ధర్మపురిలో 15 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులు, మెట్‌పల్లిలో 26 వార్డులు, కోరు ట్లలో 33 వార్డులున్నాయి.
జగిత్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఖరారుకు నోటిపికేషన్ విడుదల చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు అందడంతో ఈ మేరకు ప్రక్రియ కొనసాగుతోంది.
ఫ 11 నెలల క్రితం ముగిసిన పాలక వర్గాల గడువు
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగగా వాటి ఫలితాలు అదే నెల 25వ తేదీన వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. గత యేడాది జనవరి 27వ తేదీతోనే పాలకవర్గాల కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి మున్సిపా లిటీల్లో ప్రత్యేకపాలన కొనసాగుతోంది. 11 నెలల తర్వాత ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది.
ఫ జిల్లాలో 5 మున్సిపాలిటీలు.. 136 వార్డులు
జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 136 వార్డులున్నాయి. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డులు, ధర్మపురిలో 15 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులు, మెట్‌పల్లిలో 26 వార్డులు, కోరు ట్లలో 33 వార్డులున్నాయి. జగిత్యాలలో 96,410 ఓటర్లుండగా 149 పోలింగ్ స్టేషన్లు, ధర్మపురిలో 14,222 మంది ఓటర్లు 24 పోలింగ్ స్టేషన్లు, రాయికల్‌లో 13,195 మంది ఓటర్లు 24 పోలింగ్ స్టేషన్లు, కోరుట్లలో 63,741 మంది ఓటర్లు 94 పోలింగ్ స్టేషన్లు, మెట్‌పల్లిలో 46,371 మంది ఓటర్లు 64 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఫ అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు
అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే ఎన్నికల సంఘం జాబితాల ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణ ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు చేపట్టనున్నారు. 5న రాజకీయ పార్టీ ప్రతినిధులతో మున్సిపాలిటీల్లో, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. 10వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించ నున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేస్తారని రాజకీయ పార్టీ నేతలు భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఫ రాజకీయ పార్టీల్లో మొదలైన హడావుడి
పంచాయతీ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పోటీ చేయాలనుకున్న వారంతా ఎన్నికల కోసం సిద్దమవుతుండటంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది.
ఫ జర్వేషన్లపై ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్‌లపై ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో ఏ వార్డు ఏ కేటగిరికి రిజర్వ్ అయింది.. ఇప్పుడు ఏ కేటగిరికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజన పూర్తయినప్పటికీ మహిళలు, పురుషులు, ఇతర ఓటర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ల లెక్కింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. సామాజిక వర్గాల వారీగా లెక్కింపు ప్రక్రియను సైతం త్వరలో పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ఫ ప్రధాన పార్టీల నుంచి పోటీకి సై
ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో ఆశావహుల మధ్య పోటీ పెరుగనుంది. అధికార కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి కొన్ని వార్డుల్లో ఒకరికన్నా ఎక్కువ మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులకు టికెట్ల కేటాయింపు తలనొప్పి కానుందనే చర్చ నడుస్తోంది.