Share News

విద్యుత్‌ సమస్య తీరేలా..

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:54 AM

పెరుగుతున్న అవసరాల దృష్ట్యా జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సంబంధిత శాఖ కృషి చేస్తోంది.

విద్యుత్‌ సమస్య తీరేలా..

ఇదీ.. కరీంనగర్‌లోని కొత్త కలెక్టరేట్‌లో ఉన్న స్థలం. ఇక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌లోని కార్యాలయాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాటు చేయాలనుకున్న సబ్‌స్టేషన్‌ కోసం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వ భూమి. పాత కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న ఈ స్థలంలో ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇతర జిల్లాల్లో కలెక్టరేట్‌ ఆవరణలోనే ఉన్న సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్‌లో స్థలం అందుబాటులో లేకపోవడంతో ముందర ఉన్న ఈ చోటుతోపాటు సమీపంలోని మరో రెండు చోట్ల స్థలాల్ని అన్వేషిస్తున్నారు.

- కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌ పరిధిలోని కృష్ణనగర్‌లో 5 కోట్లకుపైగా వ్యయంతో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చివరి దశలో ఉంది. కొన్ని పనులు పూర్తయితే వచ్చే నెలలో ప్రారంభించి విద్యుత్‌ సరఫరాను సమీప కాలనీలకు అందించనున్నారు. ఇది పూర్తవడంతో దుర్శేడ్‌, ముగ్ధుంపూర్‌ సమీపంలోని విద్యుత్‌ వినియోగదారులకు లోవోల్టేజీ ఇక్కట్లు తొలిగిపోయే వీలుంది. నిత్యం పర్యవేక్షణతో పనుల్లో వేగాన్ని పెంచుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

పెరుగుతున్న అవసరాల దృష్ట్యా జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సంబంధిత శాఖ కృషి చేస్తోంది. వినియోగదారులకు మెరుగైన సరఫరాను అందించేందుకు వీలుగా కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రైతుల నుంచి వినిపిస్తున్న డిమాండ్‌, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. వెరసి పలు చోట్ల కొత్తగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో గృహ, కమర్షియల్‌, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ డిమాండ్‌ ప్రతి ఏడాదికి పెరుగుతోంది. పైగా అన్ని రకాల కనెక్షన్లు 5లక్షల వరకున్నాయి. వీటికి విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో కీలకమైన సబ్‌స్టేషన్లు ఎన్ని పెరిగితే మరింత మెరుగైన కరెంట్‌ సరఫరా ప్రజలకు అందనుంది.

ఫ లోపాలను అధిగమిస్తూ...

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో కొత్తగా 11 కేవీ, 33 కేవీ విద్యుత్‌ తీగలను చాలాచోట్ల పాత వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా కండెన్సర్లను కూడా మార్చారు. తరచూ కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లను కూడా వోల్టేజీ స్థాయిలను పెంచారు. కనెక్షన్ల సంఖ్యను బట్టి అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో చాలాచోట్ల అంతరాయానికి ఎదురైన ఇబ్బందులు తొలిగాయి. అన్నింటికన్నా ముఖ్యంగా గతంలో మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో అండర్‌గ్రౌండ్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కరీంనగర్‌లోని సర్కస్‌ గ్రౌండ్‌ సమీపంలో నెలకొల్పిన ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ ప్రయోగాత్మకంగా విజయవంతమైంది. సరఫరా, భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేవు. అందుకనే జిల్లాలో ఇక మీదట కొత్తగా మంజూరయ్యే వాటిని ఇండోర్‌లోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

ఫ అవసరమైన చోట ఏర్పాటు

జిల్లాలో పదేళ్లలో 10కిపైగా సబ్‌స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. అవసరమైన చోట ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల వారీగా లోఓల్టేజీ భారాన్ని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలో బొంతుపల్లి, మోత్కులగూడెంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గుర్తించిన స్థలం విషయంలో వివాదాలు ఉండడంతో పనులు ప్రారంభమవలేదు. వీటి నిర్మాణానికి అడ్డంకులు తొలిగించేందుకు రెవెన్యూ అధికారుల సహకారాన్ని విద్యుత్‌ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. కొత్తగా జిల్లాలో మరో ఐదు చోట్ల ప్రతిపాదనలను గతంలోనే సిద్ధం చేసినా నిధులు మంజూరవలేదు. కరీంనగర్‌లోని ఆటోనగర్‌లో కొత్తగా అండర్‌గ్రౌండ్‌ సబ్‌స్టేషన్‌కు త్వరలో నిధులు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో స్థలాభావం దృష్ట్యా అండర్‌గ్రౌండ్‌ నిర్మాణాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తంగా కొత్తవి సకాలంలో మంజూరై వచ్చిన నిధులతో చకచకా నిర్మాణాలు పూర్తయితే ప్రజలకు మేలు జరుగనుంది.

Updated Date - Nov 06 , 2026 | 12:54 AM