Share News

నేడు విజయదశమి

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:11 AM

విజయ దశమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరుపుకోనున్నారు.

నేడు విజయదశమి

- శమీపూజకు ఏర్పాట్లు

- మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

జగిత్యాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయ దశమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరుపుకోనున్నారు. ఈ మేరకు గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా దసరా ఉత్సవాలు, మహిషాసుర మర్ధనం, నవరాత్రోత్సవాల ముగింపు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజులు నవరాత్రులు జపుపుకొని, పదవ రోజు విజయ దశమి నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. విజయ దశమి ముగియనున్న నేపథ్యంలో ఆలయాలు, ప్రధాన కూడళ్లు, ఉత్సవ మండపాలు సందడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు దుర్గాదేవీ మండపాలను నిర్వహిస్తున్నారు.

ఫమహిషాసురమర్ధినికి ఏర్పాట్లు..

జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో శమిపూజ నిర్వహణకు అనుగుణంగా గద్దెలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పలు కుల సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, దేవాల యాల నిర్వాహకులు తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల ముగింపును వైభవంగా పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. పలు గ్రామాలు, పట్టణాల్లో మహిషాసుర ఊరేగింపులు, దేవీ విగ్రహాల ఊరేగింపులను డప్పు వాయిద్యాలతో నిర్వహించనున్నారు. మహిషాసురమర్ధిని ఉత్సవాలు డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త దుస్తులు ధరించడం, కొత్త పనులు ప్రారంభించడానికి, ఆయుధాలు, వాహనాలకు పూజలు చేయడానికి పలువురు సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా దసరా సందడి నెలకొంది.

Updated Date - Oct 20 , 2026 | 01:12 AM