Share News

నేడే ఓటరన్న తీర్పు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:19 AM

ఓటరన్న తీర్పునకు వేళయింది. సిరిసిల్ల, వేములవాడ బల్దియా సమరానికి సర్వం సిద్ధమయింది. రెండు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

నేడే ఓటరన్న తీర్పు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఓటరన్న తీర్పునకు వేళయింది. సిరిసిల్ల, వేములవాడ బల్దియా సమరానికి సర్వం సిద్ధమయింది. రెండు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్స్‌ల్లో భద్రపరచనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రితో ఎన్నికల సిబ్బంది మంగళవారం సాయంత్రం వరకే సిరిసిల్ల, వేములవాడ డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాలతో పాటు పోలింగ్‌ కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పర్యవేక్షించారు. ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి మంద మకరంద్‌లు పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. బందోబస్తును ఎస్పీ మహేష్‌ బీ గీతే పనిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 175 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 110 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు, 65 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ నిర్వహణకు 1104 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు 57 మంది, పీవోలు 210 మంది, ఎపీవోలు 210 మంది, ఓపీవోలు 630 మంది ఉన్నారు. సిరిసిల్ల మునిపాలిటీలో 39 వార్డులో 117 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 69 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు, 48 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వేములవాడ మునిపాలిటీలో 28 వార్డులో 58 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 41 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు, 17 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మున్సిపాలిటీల్లో 1,22,836 మంది ఓటర్లు ఉండగా, 20 శాతం బ్యాలెట్‌ పేపర్లను అదనంగా సిద్ధం చేశారు. 175 పోలింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. అదనంగా మరో 20 శాతం బాక్స్‌లు సిద్దం ఉంచారు. పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్ల ఖరారు నుంచి ఓటర్ల చుట్టూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన ఓటర్లు మాత్రం ఎవరిని ఆదరిస్తారో, తిరస్కరిస్తారో తీర్పు తెలిసేది మాత్రం 13వ తేదిన. దీంతో ఓటరన్న తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

67 వార్డులు.. 283 మంది అభ్యర్థులు

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో 283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో బీఆర్‌ఎస్‌ 117 మంది, బీజేపీ 117 మంది, కాంగ్రెస్‌ 117 మంది, సీపీఐ ముగ్గురు, సీపీఎం ముగ్గురు, ఏఐఎఫ్‌బీ నలుగురు, జేఎస్‌పీ 12 మంది, స్వతంత్రులు 55 మంది పోటీలో ఉన్నారు. సిరిసిల్లలో 39 వార్డుల్లో 170 మంది బరిలో ఉండగా బీఆర్‌ఎస్‌ 39 మంది, బీజేపీ 39 మంది, కాంగ్రెస్‌ 39 మంది, సీపీఎం ముగ్గురు, ఏఐఎఫ్‌బీ ఇద్దరు, జేఎస్‌పీ 7 మంది, 36 మంది స్వతంత్రులు ఉన్నారు. వేములవాడలో 28 వార్డులో 113 మంది బరిలో ఉండగా, బీఆర్‌ఎస్‌ 28 మంది, బీజేపీ 28 మంది, కాంగ్రెస్‌ 28 మంది, సీపీఐ ముగ్గురు, ఏఐఎఫ్‌బీ ఒకరు, జేఎస్‌పీ ఐదుగురు, స్వతంత్రులు 19 మంది ఉన్నారు.

రెండు మున్సిపాలిటీలో 1,22,836 మంది ఓటర్లు

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో 1,22,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81,959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39,942 మంది, మహిళలు 42,011 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, 40,877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,580 మంది, మహిళలు 21,279 మంది, ఇతరులు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,699 మంది ఎక్కువగా ఉన్నారు.

నాలుగు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 175 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. సిరిసిల్లలోని శివనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మోడల్‌ కేంద్రం పోలింగ్‌ కేంద్రం, గాంధీనగర్‌ బాలరక్షభవన్‌లో గ్రీన్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్‌ పోలింగ్‌ కేంద్రం, అంబేద్కర్‌నగర్‌లో మోడల్‌ కేంద్రంగా సిద్ధం చేశారు.

ఓటర్‌ స్లిప్పు ఉన్నా.. గుర్తింపు కార్డు అవసరమే..

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు పోలు చిట్టీలు పంపిణీ చేశారు. పోలు చిట్టీలతోపాటు ఎన్నికల కమిషన్‌ సూచించిన గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టమే. పోల్‌ చిట్టీలతోపాటు ఓటర్‌ ఎపిక్‌కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి ఉద్యోగ గుర్తింపు కార్డు, ఫోటోతో కూడిన బ్యాంక్‌ పాసుబుక్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన గుర్తింపు కార్డులు, ఫోటోతో కూడిన ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

811 మందితో పోలీస్‌ బందోబస్తు..

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పోలింగ్‌ నిర్వహణ సక్రమంగా జరగడానికి 811 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఆరు జోన్లలో మొబైల్‌ బృందాలను, రెండు ప్లాటూన్ల సాయుధ బలగాలను, స్ట్రయికింగ్‌ పోర్స్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం బందోబస్తు చర్యలతో పాటు సిబ్బందికి ఎస్పీ మహేష్‌ బీ గీతే పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే సిబ్బందితో పాటు పోలీస్‌ బృందాలు కూడా వెళ్లాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 01:19 AM