Share News

నేడు రంజాన్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:08 AM

ముస్లింల పండుగల్లో రంజాన్‌ ముఖ్యమైనది. భక్తి విశ్వాసాలకు, కఠిన ఉపవాస దీక్షలకు నెలవైన ఈ పండుగ ముస్లింలలో భక్తి భావాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.

నేడు రంజాన్‌

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : ముస్లింల పండుగల్లో రంజాన్‌ ముఖ్యమైనది. భక్తి విశ్వాసాలకు, కఠిన ఉపవాస దీక్షలకు నెలవైన ఈ పండుగ ముస్లింలలో భక్తి భావాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. జకాత్‌, పిత్రా అంటే దాన ధర్మాలకు ప్రతీకగా భావించే ఈదుల్‌ ఫిత్ర్‌ను(రంజాన్‌) శనివారం ముస్లింలు జరుపుకోనున్నారు. 30 రోజుల ఉపవాసాలు ముగిసన తర్వాత షవ్వాల్‌ చంద్రదర్శనానంతరం ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటారు. నెలవంక కనబడగానే నెల రోజుల దీక్ష ముగించి మరుసటి రోజు ప్రత్యేక ఈద్‌ నమాజ్‌ సామూహికంగా చేసి పండుగ జరుపుకుంటారు. మాసమంతా దివ్య ఖురాన్‌ పఠనంతో పాటు రోజు వారీ చేసే 5 మార్ల నమాజ్‌, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అల్లాహ్‌ పై తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. దాన ధర్మాదుల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.

ఫ నేడు సామూహిక ప్రార్థనలు

జిల్లా కేంద్రంలో పురానీ ఈద్గాతోపాటు సాలేహ్‌నగర్‌, చింతకుంట, బైపాస్‌ రోడ్‌, తదితర ప్రాంతాల్లో, మండల, గ్రామపంచాయితీల్లో గల ఈద్గాలు, మజీద్‌లలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. వీటికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మత పెద్దలు ప్రార్థనలు, ప్రసంగాలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో ముస్లింలు రంజాన్‌ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఫ ఘనంగా అల్విదా జుమ్మా

రంజాన్‌ మాసం సందర్భంగా చివరి శుక్రవారం నగరంలోని పలు మసీదులన్నీ ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడాయి. కొన్ని రోజులుగా ఆరంభించిన ఖురాన్‌ పఠనం శుక్రవారంతో ముగించారు. ముస్లింల పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసి వారి యెడల తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. రాత్రంతా ప్రార్థనలు చేశారు. పలు వీధుల్లో పేదలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేసి జకాత్‌ ఫిత్రా దానాలు చేశారు.

Updated Date - Mar 21 , 2026 | 12:08 AM